కరోనా వైరస్‌ రాకుండా ఉండటానికి తీసుకోవల్సిన జాగ్రత్తలు

కరోనా వైరస్‌ సోకకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ముందుగా ఈ వ్యాధిపై అవగాహన పెంచుకోవాలి. కరోనా వైరస్‌ ఉన్నవారిలో ఎలాంటి లక్షణాలుంటాయో తెలుసుకోవాలి.
ఈ వ్యాధి సోకిన వారికి దూరంగా ఉండండి.

ముఖ్యంగా వారి కన్ను, నోరు లేదా ముక్కును తరచుగా తాకకూడదు. చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి. ఆల్కహాల్‌ ఉండే శానిటైజర్‌తోగానీ, సబ్బుతోగానీ బాగా కడుక్కోవాలి. కరచాలనాలు చేయడం మానేయాలి.

రోజుల తరబడి ఒకే డ్రస్‌ వేసుకోకూడదు. దగ్గు, జలుబుతో బాధపడుతున్న వారికి కనీసం మూడు మీటర్ల దూరంలో ఉండాలి. జనం ఎక్కువుగా ఉన్న ప్రదేశాలకు దూరంగా ఉండాలి. దగ్గు, జలుబుతో బాధపడుతున్నవారు తుమ్మినా లేదా దగ్గినా టిష్యూ లేదా శుభ్రమైన వస్త్రాన్ని అడ్డు పెట్టుకోవడం, ఎదురుగా ఉన్న వ్యక్తికి దూరంగా జరగడం లాంటివి చేయాలి.

మాస్క్‌ లేదా నాలుగు, ఐదు పొరలతో ఉన్న రుమాలునైనా ధరించాలి. ప్రయాణాల్లో, షాపింగ్‌ సమయాల్లో, ఆఫీసుల్లో అవసరమైన ప్రతి వస్తువును చేతితో తాకుతూనే ఉంటాం. ఆ సమయంలో వైరస్‌ సోకే అవకాశం ఉంది. అవే చేతులతో కళ్లను నలిపినా, ముక్కును, నోటిని తాకినా ఆ వైరస్‌ శరీరంలోకి ప్రవేశించవచ్చు. కనుక అదే పనిగా చేతులతో కళ్లను, నోటిని, ముక్కును తాకవద్దు.

బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదు. పచ్చిగా ఉన్నవి లేదా సగం ఉడికిన మాంసం, గుడ్లు తినకూడదు. బయటికి వెళ్లి వచ్చినప్పుడల్లా, తినేముందు, వంట చేసేముందు, హ్యాండ్‌వాష్‌తో కనీసం 20 సెకన్ల పాటు చేతులు కడుక్కోవాలి.

ఎక్కువమంది గుమిగూడి ఉన్నచోటికి వెళ్లకపోవడం మంచిది. చంటిపిల్లల్ని, వృద్ధుల్ని గుంపుగా జనం ఉన్నచోట్లలోకి తీసుకెళ్లకూడదు. తగిన ప్రోటీన్లున్న పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణం దగ్గర్లో ఉన్న ప్రభుత్వాసుపత్రికి వెళ్లి, తగిన పరీక్షలు చేయించుకోవాలి.