ఏప్రిల్‌ 25న విడుదల కానున్న మహర్షి

కొన్ని రోజులుగా ‘మహర్షి’ సినిమా విడుదల తేదీ గురించి జరుగుతున్న చర్చలకు ఫుల్‌స్టాప్‌ పడింది. ఈ సినిమాను ఏప్రిల్‌ 25న విడుదల చేయనున్నట్లు నిర్మాత ‘దిల్‌’ రాజు పేర్కొన్నారు. మహేశ్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అశ్వనీదత్, ‘దిల్‌’ రాజు, పీవీపీ నిర్మిస్తున్న సినిమా ‘మహర్షి’. ముందుగా ఈ సినిమాను ఏప్రిల్‌ 5న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఆ తర్వాత అనుకున్న తేదీకి ‘మహర్షి’ విడుదల కావడం లేదని, ఏప్రిల్‌ 26కు వాయిదా పడిందని వార్తలు వచ్చాయి. ఫైనల్‌గా ఈ సినిమాను ఏప్రిల్‌ 25న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.

ఇదిలా ఉంటే మహేశ్‌బాబు సూపర్‌ హిట్‌ చిత్రాలు ‘పోకిరి (2006 ఏప్రిల్‌ 28), భరత్‌ అనే నేను (2018 ఏప్రిల్‌ 20)’ ఏప్రిల్‌ నెలలోనే విడుదలయ్యాయి. సో.. ఆ సెంటిమెంట్‌ ప్రకారం ‘మహర్షి’ కూడా మంచి విజయం సాధిస్తుందని ఆయన అభిమానులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ‘మహర్షి’ షూటింగ్‌ పొల్లాచ్చిలో జరుగుతోంది. కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌ ఈ నెల 28 వరకు జరుగుతుంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో ‘అల్లరి’ నరేశ్‌ కీలక పాత్ర చేస్తున్నారు. అన్నట్లు.. మంగళవారం మహేశ్‌ సతీమణి నమ్రత బర్త్‌డే. భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. ఆమెతో దిగిన ఫొటోను మహేశ్‌ ట్వీటర్‌లో పోస్ట్‌ చేశారు.