వేశ్య పాత్రలో చూసి సెట్ లో అందరు షాక్ అయ్యారు

‘సూపర్‌ డీలక్స్‌’ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన ఓ సన్నివేశాన్ని చూసి సెట్‌లో ఉన్నవారు షాకయ్యారని అంటున్నారు ప్రముఖ నటి రమ్యకృష్ణ. త్యాగరాజన్‌ కుమారరాజ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సమంత ప్రధాన పాత్రలో నటించారు. విజయ్‌ సేతుపతి హిజ్రా పాత్ర పోషించారు. రమ్యకృష్ణ శృంగారతారగా నటించారు. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌లో రమ్యకృష్ణ పాత్ర అభిమానులను సర్‌ప్రైజ్‌కు గురిచేసింది. నీలాంబరి (నరసింహా సినిమాలో రమ్యకృష్ణ పాత్ర), శివగామి (బాహుబలి)వంటి పవర్‌ఫుల్‌ పాత్రల్లో నటించిన రమ్యకృష్ణ ఇందులో శృంగారతారగా నటించడం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సినిమాలోని తన పాత్ర గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు రమ్యకృష్ణ.

‘సూపర్‌డీలక్స్‌’ సినిమాలో నటీనటుల కంటే కంటెంట్‌దే ప్రధాన పాత్ర. దర్శకుడు కుమారరాజా తాను అనుకున్నట్లే చాలా బాగా తెరకెక్కించారు. ఇందులో నేను వేశ్య పాత్రలో నటించాను. ఇప్పటివరకు నేను చేసిన పాత్రలు ఓ ఎత్తైతే.. ఈ పాత్ర మరో ఎత్తు. సినిమాలో నేను నటించాల్సిన ఓ సన్నివేశానికి ఏకంగా 37 టేక్‌లు తీసుకున్నా. ఆ సన్నివేశం పూర్తిచేయడానికి రెండు రోజులు పట్టింది. అది చూసి నాకంటే.. నా అసిస్టెంట్లు, సెట్‌లో ఉన్నవారే షాకయ్యారు. కొన్ని పాత్రలను డబ్బు కోసం చేస్తాం. మరికొన్ని పాపులారిటీ కోసం, పేరు కోసం చేస్తాం. ఇంకొన్ని ఇష్టంతో చేస్తాం. ఈ సినిమాను మాత్రం నేను ఇష్టపడే చేశాను’ అని వెల్లడించారు. మార్చి 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.