కార్తీ మూవీ తో కోలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నకన్నడ బ్యూటీ రష్మిక

నటుడు కార్తీ కొత్త చిత్రం బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈయన నటించిన దేవ్‌ నిరాశపరిచిన విషయం తెలిసిందే. దీంతో కార్తీ తాజా చిత్రాల విషయంలో జోరు పెంచారనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన ఖైదీ అనే చిత్రంలో నటిస్తున్నారు. మానగరం ఫేమ్‌ లోకేశ్‌ కనకరాజ్‌ దీనికి దర్శకుడు. ఇది ఒక రాత్రిలో జరిగే కథతో తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ఇందులో హీరోయిన్‌ కూడా ఉండదట. కాగా ఖైదీ చిత్ర షూటింగ్‌ పూర్తి కావస్తుండడంతో కార్తీ తదుపరి చిత్రానికి రెడీ అయ్యారు.

తాజా చిత్రం బుధవారం ఉదయం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇందులో టాలీవుడ్‌లో క్రేజీ కథానాయకిగా వెలుగొందుతున్న కన్నడ బ్యూటీ రష్మిక కార్తీతో రొమాన్స్‌ చేయనుంది. ఇదే ఈ అమ్మడి కోలీవుడ్‌ ఎంట్రీ చిత్రం. నటుడు యోగిబాబు ముఖ్య పాత్రల్లో నటించనున్న దీనికి రెమో చిత్రం ఫేమ్‌ భాగ్యరాజ్‌ కన్నన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వివేక్‌–మెర్విన్‌ల ద్వయం ఈ చిత్రానికి సంగీతాన్ని, సత్యన్‌ సూర్యన్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

ఈ చిత్రాన్ని డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌ఆర్‌.ప్రకాశ్, ఎస్‌ఆర్‌.ప్రభు నిర్మిస్తున్నారు. చిత్ర షూటింగ్‌ను కంటిన్యూగా చెన్నై ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం కోసం చెన్నైలో భారీ సెట్స్‌ను వేస్తున్నట్లు చెప్పారు. కామెడీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందంటున్నారు చిత్రయూనిట్‌.