రెండు కోట్ల ఆఫర్ ని ‘నో’ చెప్పిన సాయి పల్లవి

ఫిదా భామ సాయి పల్లవికి తాను చేసే పాత్ర నచ్చాలి. అలాగే సినిమాలో తన క్యారెక్టర్ కి ఓ రేంజ్ ఉండాలి. అలా అయితేనే ఈ పిల్ల సినిమాలు ఒప్పుకుంటుంది. లేదంటే ఒప్పుకోదు అనే ప్రచారం ఎంసీఏ, కణం సినిమాలప్పటి నుండి జరుగుతుంది. ఇక సాయి పల్లవి డామినేషన్ తట్టుకోలేక కొంతమంది హీరోలు సఫర్ అయ్యారనే ప్రచారమూ ఉంది. తాజాగా ఆమె తమిళ డైరెక్టర్ విజయ్ తో ప్రేమాయణం నడుపుతుందని అన్నారు. ఇక లైఫ్ ఇచ్చిన నిర్మాత అడిగినా తన పాత్ర నచ్చనందున సినిమా చెయ్యనని చెప్పిందని శ్రీనివాస కళ్యాణం సినిమా అప్పుడు టాక్ నడిచింది. అందులో నిజమెంతుందో తెలియదు కానీ సాయి పల్లవికి నచ్చని పని మాత్రం అస్సలు చెయ్యదు.

మంచి ఆఫర్ వచ్చినా…

అందుకే అమ్మాయికి పొగరెక్కువనే ప్రచారం జరుగుతుంది. డాన్సర్ గా వచ్చిన సాయి పల్లవి టాలెంట్ తో హీరోయిన్ అయ్యింది. హీరోయిన్ గా తనకంటూ ఓ క్రేజ్, ఇమేజ్ వచ్చింది. అందుకే సాయి పల్లవితో రకరకాల బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా లాక్ చేసి క్యాష్ చేసుకుందామనుకుంటే ఈ పిల్ల వినడం లేదు. సాయి పల్లవికి ఏదైనా ప్రాడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా నటించడం ఇష్టం ఉండదట. అందుకే ఇప్పటివరకు ఏ ప్రొడెక్టుతో ఎలాంటి యాడ్ లోనూ సాయి పల్లవి కనిపించలేదు. తాజాగా ఓ రెండు కోట్ల ఆఫర్ ని కూడా సాయి పల్లవి కాలదన్నిందనే న్యూస్ నడుస్తుంది. ఒక ప్రముఖ ఫేస్ క్రీమ్ యాజమాన్యం సాయి పల్లవిని తమ ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండమని.. తమ ప్రొడక్ట్స్ కి ప్రచారం చేస్తే రెండు కోట్ల పారితోషికం ఇస్తామని ఆఫర్ చేసిందట. రెండు కోట్ల ఆఫర్ ని సాయి పల్లవి సున్నితంగా తిరస్కరించిందిట. నేను మొహానికి మేకప్ వేసుకోకుండా సినిమాల్లో నటిస్తున్నాను.. అలాంటిది ఫేస్ క్రీమ్ వాడమని నేనెలా ప్రచారం చేస్తానని ఆ బిగ్ డీల్ కి నో చెప్పిందట.