15 ఏళ్ల విరామం తర్వాత తెర పైన కనిపించనున్న సీనియర్‌ స్టార్

అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు సినిమాలో ఇద్దరు సీనియర్‌ స్టార్స్‌ సందడి చేయబోతున్నారట. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మహేశ్‌ నటించబోతున్న సంగతి తెలిసిందే. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తున్నట్లు తెలిసింది. ఇందులో విజయశాంతి, ఉపేంద్ర కీలక పాత్రలు పోషించబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు పలు వెబ్‌సైట్లలో తెగ ప్రచారం జరుగుతోంది. దాదాపు 15 ఏళ్ల విరామం తర్వాత విజయశాంతి నటించబోతున్నారని చెప్పడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇదే నిజమైతే.. ముగ్గురు స్టార్స్‌ ఒకే తెరపై సందడి చేయడం అభిమానులకు కనులవిందుగా ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. మహేశ్, విజయశాంతి కలిసి 1989లో ‘కొడుకు దిద్దిన కాపురం’ సినిమాలో నటించారు. ఈ సినిమాలో కృష్ణ కథానాయకుడి పాత్ర పోషించారు. ఈ సినిమా దర్శక, నిర్మాణ బాధ్యతల్ని కూడా ఆయన చూసుకున్నారు.

మహేశ్‌ 26వ చిత్రంగా రానున్న ఈ సినిమాలో రష్మిక కథానాయికగా ఖరారైనట్లు తెలిసింది. అయితే దీనికి సంబంధించి చిత్ర బృందం స్పందించాల్సి ఉంది. ‘మహర్షి’ షూటింగ్‌ పూర్తయిన తర్వాత మహేశ్‌ ఈ సినిమా షూట్‌లో పాల్గొననున్నారు. వంశీ పైడిపల్లి ‘మహర్షి’కి దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. అల్లరి నరేష్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు అందిస్తున్నారు. మే 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.