‘జెర్సీ’ మూవీ రివ్యూ

నటీనట వర్గం: నాని,శ్రద్ధా శ్రీనాథ్,సత్యరాజ్,రావు రమేష్

దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి

రేటింగ్: 4/5

ప్రయత్నంలో సక్సెస్ అందరికీ దక్కదు.. ఎక్కడో వందలో ఒకరికి. ‘జెర్సీ’ కథ వందలో సక్సెస్ అయిన ఒక్కడిది కాదు. సక్సెస్ అవ్వకపోయినా ప్రయత్నిస్తూ మిగిలిపోయిన 99 మందిది. తన తండ్రిని హీరోగా చూడాలని కోరుకున్న ఓ కొడుకు చెప్పే కథే ‘జెర్సీ’. పోగొట్టుకున్నదాన్ని తిరిగి పొందాలనే ఆలోచన అన్ని సార్లూ, అందరికీ కలగదు. చులకన చేసే చూపులు, హేళనచేసే మాటలు తనలోని చేతకానితనాన్ని వెక్కిరిస్తుంటే… ఏ మనిషికైనా తనేంటో నిరూపించుకోవాలనిపిస్తుంది. విజయం కోసం చేసే ప్రయత్నాల్లో ఎన్నిసార్లు ఓడిపోయినా తప్పు లేదు కానీ, అసలు ప్రయత్నం చెయ్యడంలోనే ఓడిపోవడం సరికాదేమో అనిపిస్తుంది. అలా మొదలైన భావోద్వేగ పోరాటమే ‘జర్సీ’.

ఇండియాలో క్రికెట్ అనేది ఒక మతం అయితే.. సినిమా అనేది వ్యసనం. ఈ రెండింటినీ బేస్ చేసుకుని నటనను మంచినీళ్లప్రాయంలా చేసే నేచురల్ స్టార్ నానిని క్రికెటర్‌గా ఆవిష్కరించాలన్న ప్రయత్నం బాగానే ఉన్నా.. ఆచరణలో పెట్టడం అంటే పెద్ద సాహసమే. అయితే ఆ సాహసాన్ని రెండో ప్రయత్నంతో విజయతీరాలకు చేర్చారు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి.

నేచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాథ్ హీరో హీరోయిన్లుగా నటించిన మోస్ట్ ఎమోషనల్ జర్నీ ‘జెర్సీ’ నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ‘మళ్లీ రావా’ వంటి ఫీల్ గుడ్ మూవీతో దర్శకుడిగా ప్రశంసలు దక్కించుకున్న గౌతమ్ తిన్ననూరి క్రికెట్ నేపథ్యంలో జీవిత పాఠంతో కూడిన ఎమోషనల్ జర్నీని ‘జెర్సీ’ చిత్రంతో ప్రేక్షకులకు అందించారు.

26 ఏళ్ల అర్జున్ క్రికెట్‌లో తిరిగులేని ప్లేయర్‌గా ఉంటాడు. ఇండియన్ క్రికెట్‌ టీంకి ఆడాలన్నది అతని కళ. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 28 సెంచరీలు.. 68 ఆఫ్ సెంచరీలు ఇవీ అతని ట్రాక్ రికార్డ్స్. ఆటలో దూకుడుగా ఉండే అర్జున్ రియల్ లైఫ్‌లోనూ అలాగే ఉంటాడు. అతని ఆటతో వ్యక్తిత్వం నచ్చిన సారా (శ్రద్ధా శ్రీనాథ్) పెద్దల్ని ఎదిరించి అర్జున్‌ను పెళ్లి చేసుకుంటుంది. సారాని పెళ్లి చేసుకున్న తరువాత బలమైన కారణంతో తాను అమితంగా ఇష్టపడే క్రికెట్‌ను వదిలేస్తాడు అర్జున్. ( ఈ కారణమే కథలో కీలకం). భార్య సలహా మేరకు ప్రభుత్వ ఉద్యోగంలో చేరతాడు. అయితే అర్జున్ లంచం తీసుకున్నాడనే ఆరోపణలతో సస్పెండ్ అవుతారు. ఆ కేసు ఏళ్ల తరబడి కోర్టులో నడుస్తుంటుంది. దీంతో భార్య సారా సంపాదనపైనే ఆధారపడతాడు అర్జున్.

‘జెర్సీ’ కథకు మూలం.. సారా, అర్జున్‌కు పుట్టిన కొడుకు నాని. తన బర్త్ డే నాడు సంపాదన లేని తన తండ్రిని రూ. 500 పెట్టి ‘ఇండియన్ జెర్సీ’ కొని ఇవ్వమని కొడుకు అడగడం.. భార్య సంపాదనపై ఆధారపడ్డ నాని.. జెర్సీ కొనడం కోసం అనేక ప్రయత్నాలు చేసి.. ఆ ప్రయత్నాల్లో విఫలమై చివరికి పదేళ్ల క్రితం ఆపేసిన క్రికెట్ ప్రయత్నాన్ని మళ్లీ మొదలు పెడతాడు. ఇంతకీ నాని 26 ఏళ్ల వయసులో చేయలేనిది 36 ఏళ్ల వయసులో చేయగలిగాడు? అప్పుడు క్రికెట్‌ను వదిలేయడానికి కారణం ఏంటి? ఇంతకీ క్రికెటర్ అర్జున్ ప్రయత్నంలో విజయం సాధించాడా? ఓడిపోయాడా? అన్న భావోద్వేగ జర్నీని తెరపై చూడాల్సిందే.

ఈ సినిమాకి నానిని హీరోగా ఎంచుకోవడంతోనే దర్శకుడు గౌతమ్ తిన్ననూరి సగం సక్సెస్ అయ్యారనేది చిత్రం చూస్తే అర్ధమైపోతుంది. ఎందుకంటే అర్జున్ పాత్రలో నాని నటించలేదు. జీవించారు. ఆ పాత్రకు ప్రాణం పెట్టారు. అంతలా అర్జున్ పాత్రను ఎమోషనల్ రైడ్‌గా మార్చేశారు దర్శకుడు. ‘జెర్సీ’ అనే సింపుల్ లైన్‌ తీసుకుని దాన్ని గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో మాయ చేశారు దర్శకుడు. 1986 నాటి కథను ప్రజెంట్ జనరేషన్‌కి కనెక్ట్ అయ్యేలా నడిపించిన తీరు అద్భుతం అనే చెప్పాలి.

ఈ చిత్రంలో తెరపై నానిని మరిచిపోయి క్రికెటర్ అర్జున్‌ని మాత్రమే చూసేలా స్క్రీన్ ప్లేతో మాయ చేశారు దర్శకుడు. ముఖ్యంగా తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషన్స్ సీన్స్‌కి కంటతడి పెట్టని ప్రేక్షకుడు ఉండరంటే అతిశయోక్తి కాదు. నాన్న కోపంతో చెంపమీద కొడితే.. ఏమైందిరా అని తల్లి అడిగితే బాల్ తగిలిందని అమాయకంగా చెప్పే కొడుకు పాత్రను సృష్టించిన దర్శకుడ్ని ప్రశంసించకుండా ఉండలేం.

‘ఇంతపెద్ద ప్రపంచంలో నన్ను జడ్జ్ చేయని వాడు నా కొడుకు ఒక్కడే.. వాడి దృష్టిలో నేను కొంచెం తగ్గినా తట్టుకోలేను’ అంటూ 36 ఏళ్ల వయసులో బ్యాట్ పట్టి గ్రౌండ్‌లోకి దిగిన నానిని చూసి ప్రతి కొడుకు గర్వపడేలా చేశారు దర్శకుడు.

ఒక ప్రేమికుడిగా.. జీవితంలో ఏదైనా సాధించాలనే తపన పడే యువకుడిగా.. కనీసం కొడుకు పుట్టిన రోజుకి రూ. 500 లేని నిస్సహాయ తండ్రిగా.. సంపాదించే భార్య లాగిపెట్టి చెంపపై కొట్టినా మౌనంగా భరించి.. గుండెలు పగిలే బాధను మనసులోనే దాచుకుని మథనపడే వేరియేషన్స్ ఉన్న పాత్రలో నాని జీవించారు. క్రికెటర్ అర్జున్‌గా కెరియర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. లంచం తీసుకున్నాడనే అనుమానంతో ఉద్యోగం పోగొట్టుకున్న నాని.. తిరిగి అదే లంచంతో ఉద్యోగం సంపాదించడం ఇష్టం లేక.. వ్యక్తిత్వాన్ని చంపుకోలేక ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో భావోద్వేగాన్ని పండించారు.

ఈ సినిమాలో తెరపై నాని కనిపించరు. క్రికెటర్ అర్జున్ మాత్రమే కనిపిస్తారు. అందుకే అర్జున్ రంజీకి సెలెక్ట్ అయితే థియేటర్స్ ప్రేక్షకులు విజిల్స్ వేశారు.. హైదరాబాద్ టీంని అర్జున్ గెలిపిస్తే థియేటర్స్‌లో చప్పట్లు కొట్టారు. కథలో అంతలా లీనం అయ్యేలా తన నటనతో మాయ చేశారు నాని. బ్యాట్‌తో సిక్స్‌లు బాది విజిల్స్ వేయించడమే కాదు.. భావోద్వేగాలతో బౌండరీలు దాటించారు.

ఇక సారా పాత్రలో నటించిన శ్రద్ధా శ్రీనాథ్.. లవర్‌గా, భార్యగా, పదేళ్ల కొడుక్కి తల్లిగా రకరకాల వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆకట్టుకుంది. రొమాంటిక్ సన్నివేశాలతో పాటు ఎమోషన్స్ సీన్లను పండించింది. ‘దెబ్బ తగిలిన ప్రతిసారి పారిపోతున్నావ్.. ఏదో ఒకసారి నన్ను వదిలేసి వెలిపోతావ్ అని భయంగా ఉంది’ అంటూ ఆమె పలికించిన డైలాగ్స్ కళ్లు చెమర్చేలా చేశాయి.

ఈ సినిమాలో మరో ప్రధాన హైలైట్. నానికి కొడుకుగా నటించిన నాని (రోనిత్). ఈ బుదతడు స్క్రీన్‌పై కనిపించిన ప్రతిసారి ఎమోషన్స్‌ని వరదలా పారించాడు. ముఖ్యంగా నాని కాంబినేషన్ సీన్లలో ఏడిపించేశారు. ‘నాన్న నిన్ను హీరోగా చూడాలని ఉంది.. క్రికెట్ ఆడు.. నువ్ బాగా ఆడుతావ్’ అంటూ చెప్పిన డైలాగ్‌తో పాటు.. జెర్సీ కొనమని అడిగే సీన్.. నాని కోప్పడి కొట్టిన సందర్భంలో తన తల్లికి బాల్ తగిలిందని అబద్ధం చెప్పే సీన్‌లలో ఆడియన్స్‌ని ఏడిపించేశారు. ఇక నానికి కోచ్‌గా నటించిన సత్యరాజ్ ఎప్పటిలాగే పాత్రకు న్యాయం చేశారు. రావు రమేష్, ప్రవీణ్ తదితర నటీనటులు ఉన్నంతలో బాగానే చేశారు.

అయితే జెర్సీ కథ ఎమోషనల్ జర్నీగా సాగినప్పటికీ కథ మొత్తం క్రికెట్ నేపథ్యంలో ఉండటంతో క్రికెట్‌ను ఇష్టపడని వాళ్లకు ఈ కథ రుచించకపోవచ్చు. ఫస్టాఫ్ సాఫీగా నడిపించిన దర్శకుడు సెకండాఫ్‌లో కథను మరింత వేగంగా నడపడంతో పాటు.. సినిమా చివర్లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకుడు ఊహించని స్థాయిలో ఉంటుంది. బరువెక్కిన గుండెలతో థియేటర్ బయటకు వచ్చేలా చేసింది. చివరి పది నిమిషాలు గుండెల్ని పిండేసే సన్నివేశాలతో అద్భుతంగా ఆవిష్కరించారు.

టెక్నికల్ పరంగా ఈ సినిమాకి పాటలతో పాటు అనిరుధ్ అందించిన నేపథ్య సంగీతం హైలైట్ అయ్యింది. ఎమోషన్స్ సీన్స్‌లో అనిరుధ్ మంచి నేపథ్య సంగీతం అందించి సీన్స్ పండేలా చేశారు. 1986 నాటి పరిస్థితులతో.. పీరియాడిక్‌ నేపథ్యంలో సాగినా ఈ కథకు ఆర్ట్ వర్క్‌తో పాటు.. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ చాలా ప్లస్ అయ్యింది. ముఖ్యంగా జాన్ వర్గీస్ కెమెరా జిముక్కులతో రెండున్నర గంటల క్రికెట్ వినోదాన్ని అందించారు. నిజంగా క్రికెట్ మ్యాచ్ చూస్తున్న ఫీల్ కలిగించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.