దేవ్ మూవీ రివ్యూ

ఖాకీ, చినబాబు సినిమాల తర్వాత తమిళ స్టార్ కార్తి డిఫరెంట్ జోనర్ చేద్దామనే ప్రయత్నంలో చేసిన చిత్రం ‘దేవ్’. రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా చేసిన ఈ మూవీకి కొత్త రజత్ రవిశంకర్ దర్శకత్వం వహించారు. కార్తి ఇప్పటి వరకు చేసిన కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఈ తరం యువత ఆలోచన విధానానికి అద్దంపట్టేలా అడ్వంచర్స్, లవ్ ఈ రెండు అంశాలను కలగలిపి రూపొందించినట్లు ముందు నుంచీ ప్రచారం హోరెత్తించారు. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో సమీక్షిద్దాం.

కథ దేవ్ రామలింగం(కార్తి) అడ్వంచర్స్ అంటే ఇష్టపడే కుర్రాడు. అందరిలా రోటీన్ జాబ్స్ ఎంచుకోవడం కాకుండా ఫోటోగ్రఫీ చేస్తూ వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తుంటాడు. ఎప్పటికైనా ఎవరెస్ట్ అధిరోహించాలనేది అతడి కల. ఫేస్‌బుక్‌లో బిజినెస్ ఉమెన్ మేఘన(రకుల్ ప్రీత్) ఫోటో చూసి ప్రేమలో పడితాడు. అయితే మేఘన అందరి లాంటి అమ్మాయి కాదు. చిన్నతనంలోనే తన తండ్రి తమను వదిలి వెళ్లడంతో మగాళ్లంతా ఆడవారిని వాడుకునే రకమే అని మగజాతి మీద ద్వేషం పెంచుకుంటుంది. రిలేషన్ షిప్ కంటే తన వ్యాపారం, డబ్బు సంపాదనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేరకం. మరి ఇలాంటి అమ్మాయి… పెద్దగా బాధ్యతలు ఏమీ లేకుండా అడ్వంచర్స్ చేస్తూ తిరిగే అబ్బాయి మధ్య ప్రేమ ఎలా మొదలైంది? ఆపై జరిగే కథా కమామిషు ఏమిటి? అనేది తర్వాతి కథ.

కార్తి పెర్ఫార్మెన్స్ దేవ్ పాత్రలో కార్తి ఒదిగిపోయాడు. లుక్ పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. యాక్షన్స్ సీన్స్ అదరగొట్టాడు. ప్రేమలో పడిన తర్వాత మొదలయ్యే సంఘర్షణలకు సంబంధించిన సన్నివేశాల్లో భావోద్వేగాలు అద్భుతంగా పండించాడు.

రకుల్ పెర్ఫార్మెన్స్ బిజినెస్ ఉమెన్ పాత్రలో, సెల్ఫి‌ష్‌గా ఆలోచించే ప్రియురాలి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ మెప్పించింది. అయితే కొన్ని సీన్లలో రకుల్ హావభావాలు నేచురాలిటీకి దూరంగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. లుక్ పరంగా, గ్లామర్ పరంగా ఆమెను ప్రజంట్ చేసిన విధానం గత సినిమాలతో పోలిస్తే గొప్పగా లేదు. హీరో తండ్రిగా ప్రకాష్ రాజ్, హీరోయిన్ తల్లిగా రమ్యకృష్ణ, హీరో ఫ్రెండ్ పాత్రలో ఆర్‌జె విఘ్నేష్‌కాంత్, ఇతర నటీనటులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ పాయింట్స్ హ్యారిస్ జై రాజ్ అందించిన సంగీతం అంతగొప్పగా ఏమీ లేదు. పాటలు ఏవీ కూడా ప్రేక్షకులకు రిజిస్టర్ అయ్యే విధంగా లేదు. ఆంటోనీ ఆర్ రూబెన్ ఎడిటింగ్ ఇంకాస్తా షార్ప్‌గా ఉంటే బావుండేది. ఆర్ వేల్రాజ్ సినిమాటోగ్రఫీ బావుంది. నిర్మాణ విలువలు ఫర్వాలేదు.

ఫస్టాఫ్ ఎలా ఉందంటే.. ఇద్దరు స్నేహితులను వెంటేసుకుని జాలీగా తిరిగే కుర్రాడు.. అతడి ప్రెండ్షిప్‌ను టార్చర్‌గా ఫీలైన ఫ్రెండ్స్ అతడి నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఎవరైనా అమ్మాయితో ప్రేమలో పడేయాలని చేసే ప్రయత్నం… ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన అమ్మాయిని ఇంప్రెస్ చేయాలని హీరో చేసే పనులతో ఫస్టాఫ్ సోసోగా సాగింది.

సెకండాఫ్ హీరో హీరోయిన్ ప్రేమలో పడ్డ తర్వాత ఇద్దరి మధ్య అనవసరమైన కారణాలకు గొడవలు రావడం, ఇగో ఇష్యూలతో దూరంగా కావడం లాంటి రోటీన్ సీన్లతో నడిపించారు. క్లైమాక్స్ కూడా అంత గొప్పగా ఏమీ లేదు.
స్క్రీన్ ప్లే ఫెయిల్యూర్ లవ్ స్టోరీ అంటే… హీరో హీరోయిన్ మధ్య ప్రేమ మొదలవ్వడం, ఏదో ఒక కారణంగా విడిపోవడం, క్లైమాక్స్‌లో మళ్లీ కలవడం ఏ కథ తీసుకున్నా ఇదే ఉంటుంది. అయితే మూడు పాయింట్ల మధ్య జరిగే స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా, కొత్తగా ఉన్నపుడే ప్రేక్షకులకు రీచ్ అవుతుంది. ‘దేవ్’లో అలాంటి కొత్తదనం ఏమీ కనిపించలేదు.

సాగదీయడానికి ఓవర్ డ్రామా… కథను సాగదీయడానికి కొన్ని చోట్ల దర్శకుడు చేసిన ప్రయత్నాలు బెసిడికొట్టే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా స్టోరీకి సంబంధం లేని ఒక చిన్న పాపను వ్యాధి పేరుతో చంపేసి… ప్రేక్షకుడిలో ఎమోషనల్ ఫీల్ తెప్పించడానికి చేసిన ప్రయత్నం చాలా చెత్తగా ఉంది.

రోటీన్ కథాంశం తెలివైన హీరో… అతడి పక్కన తెలివిగా ఆలోచించలేని, కామెడీ పండించే రెండు ఫ్రెండ్ పాత్రలు. మగాళ్లంటే ఇష్టపడని హీరోయిన్, ఆమెను పడేయటానికి హీరో చేసే ప్రయత్నాలు. ప్రేమలో పడ్డాక విడిపోవడాలు, చివరకు కలవడాలు… చాలా సినిమాల్లో వాడిన రోటీన్ స్టోరీ ఫార్ములానే ఈ చిత్రంలోనూ దించేశారు.

దర్శకుడి పని తీరు… కొత్త దర్శకుడు రజత్ రవిశంకర్… ఎంత సేపు ప్రతి ఫ్రేము అందంగా చూపించడానికే ప్రయత్నంచాడే తప్ప… అతడి రాసుకున్న కథకు ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నాడా? లేదా? అనే అంశంపై ఫోకస్ పెట్టినట్లు కనిపించలేదు. స్టోరీ నేరేట్ చేసిన విధానం కూడా గొప్పగా లేదు.

ప్లస్ పాయింట్స్

  • హీరో కార్తి పెర్పార్మెన్స్
  • వేల్రాజ్ సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్

  • కొత్తదనం లేని కథ
  • ఆసక్తికరంగా లేని స్క్రీన్ ప్లే