100 కిలోల్ని లిఫ్ట్‌ చేసిన సామ్‌

అగ్ర కథానాయిక సమంత తన జీవనశైలిలో వ్యాయామాన్ని కూడా ఓ భాగం చేసుకున్నారు. ఆమె శారీరక దృఢత్వానికి అధిక ప్రాముఖ్యం ఇస్తుంటారు. ఇప్పటికే అనేక సార్లు సామ్‌ వ్యాయామశాలలో కసరత్తులు చేస్తుండగా తీసిన వీడియోలు, ఫొటోలను షేర్‌ చేశారు. కాగా తాజాగా ఆమె 100 కిలోల్ని లిఫ్ట్‌ చేశారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్‌ చేశారు. దీన్ని చూసి..ఆశ్చర్యపోవడం నెటిజన్ల వంతు అయ్యింది. ‘100 కిలోలు లిఫ్ట్‌ చేయడం మాటలు కాదు, న్యూ ఐరన్‌ లేడీ, దేవుడా.. ఎలా చేశావ్‌ సామ్‌, మీరు స్ఫూర్తిదాయకం..’ అంటూ తెగ కామెంట్లు చేశారు.

ఇదే సందర్భంగా సామ్‌ స్నేహితురాలు మల్లిక మైలవరపు కూడా ట్వీట్‌ చేశారు. ‘దేవుడా.. 100 కిలోలా?.. సమంత ఫీస్ట్‌ టు బీస్ట్‌. ఇది ఎలా సాధ్యమైంది?. నిజంగా చెబుతున్నా.. నీలో ఊహించనంత బలం ఇంది’ అంటూ ఆశ్చర్యంతో చూస్తున్న ఎమోజీలను షేర్‌ చేశారు. దీనికి సామ్‌ నవ్వుతున్న ఎమోజీలను పోస్ట్‌ చేశారు. ఇటీవల సామ్‌ ‘మజిలీ’ సినిమాతో మంచి హిట్‌ అందుకున్నారు. ఆమె నటించిన ‘ఓ బేబీ’ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకొంటోంది. ప్రస్తుతం సామ్‌ ‘మన్మథుడు 2’లో కీలక పాత్ర పోషిస్తున్నారు.