సూర్యకాంతం మూవీ రివ్యూ

  • నటీనట వర్గం: నిహారిక కొణిదెల,రాహుల్ విజయ్,పెర్లెన్ భేసానియా,శివాజీ రాజా,సుహాసిని
  • దర్శకత్వం: ప్రణీత్ బ్ర‌హ్మాండ‌ప‌ల్లి
  • శైలి Romantic Comedy

‘నేను హీరోయిన్ మెటీరీయల్ కాదనే విషయం నాకూ తెలుసు.. రెండు సినిమాలు ఆడనంత మాత్రాన పెద్దగా బాధపడాల్సింది ఏమీ లేదు. నేను సరిగా యాక్ట్‌ చేయడం లేదనే మాటలు నా వరకు అయితే రాలేదు. బాగా నటించడానికి ప్రయత్నించిందనే మాటలు వినిపించాయి’.. ఇవీ ‘సూర్యకాంతం’ విడుదలకు ముందు మెగా డాటర్ చెప్పిన మాటలు. అయితే రెండు సినిమాలే కాదు.. మూడో సినిమా ‘సూర్యకాంతం’తో తన ప్రయత్నాన్ని నిర్విరామంగా కొనసాగించి.. ఫలితాన్ని రాబట్టిందో లేదో సమీక్షలో తెలుసుకుందాం.

మెగా డాటర్ నిహారిక టైటిల్ రోల్‌లో నటించిన ‘సూర్యకాంతం’ మూవీ నేడు (మార్చి 29) థియేటర్స్‌లో విడుదలైంది. రాహుల్ విజయ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వం వహించారు. పెర్లిన్ భెసానియా సెకండ్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంతో ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

ఇక సూర్యకాంతం కథలోకి వెళ్తే.. ‘సూర్యకాంతం’ సినిమా ముక్కోణపు ప్రేమకథ. సూర్యకాంతం (నిహారిక) పేరుకు తగ్గట్టే ఎవరికీ అర్ధం కాని ఓ వింత పాత్ర. తనకు నచ్చింది మాత్రమే చేస్తుంది. ఎవ్వరి కోసం తను మారదు. ఎవరూ తనకోసం మారాలని అనుకోదు. తనకు తానే ముద్దు.. తన తరువాతే ఎవరైనా. ఇలాంటి ఇంట్రస్ట్రింగ్ క్యారెక్టర్‌ని తొలిచూపులోనే చూసి ప్రేమిస్తాడు అమాయకపు అభి (రాహుల్ విజయ్). లవ్, కమిట్మెంట్, ఎమోషన్స్ ఇలాంటి వాటికి దూరంగా ఉండే సూర్యకాంతం.. అభి ప్రేమను వద్దంటూనే అట్రాక్ట్ అవుతుంది. అదే సందర్భంలో అభి లవ్ ప్రపోజ్‌కి ఎలా స్పందించాలా తెలియని కన్ఫ్యూజన్‌లో ఎవరికీ చెప్పకుండా దూరంగా వెళిపోతుంది.

దీంతో అభి చిన్ననాటి స్నేహితురాలు పూజతో (పెర్లిన్ భెసానియా)తో పెళ్లి ఫిక్స్ అవుతుంది. వీరి కథ పెళ్లితో సుఖాంతం అవుతుందనుకుంటున్న సందర్భంలో సూర్యకాంతం కథలోకి రీ ఎంట్రీ ఇచ్చి సమస్యగా మారుతుంది. ఈ సమస్యకు అభి చూపిన పరిష్కారం ఏమిటి? సూర్యకాంతం, పూజలలో అభి ఎవర్ని పెళ్లి చేసుకుంటాడు? సూర్యకాంతం చివరికి సమస్యగానే మిగిలిందా.. సరైన పరిష్కారం చూపించిందా అన్నది తెరపై చూడాల్సిందే.

ఎవరు అవునన్నా కాదన్నా.. నిహారిక సినిమా అంటే హీరోయిన్ చుట్టూ కథ అల్లేయడం ఆనవాయితీగా వస్తుంది. తొలి రెండు సినిమాల్లోనూ ఇదే సాంప్రదాయాన్ని కొనసాగించారు. సూర్యకాంతంలోనూ అదే రిపీట్ చేశారు. హీరో హీరోయిన్లు ప్రేమించుకోవడం.. హీరోయిన్ మధ్యలో బ్రేకప్ చెప్పేయడం.. ఇంతలో సెకండ్ హీరోయిన్‌తో పెళ్లికి రెడీ అయిన సందర్భంలో ఫస్ట్ హీరోయిన్ ఎంట్రీ ఇవ్వడం.. ఈ ఇద్దరిలో హీరో ఎవర్ని పెళ్లి చేసుకోవాలా సతమతం అవుతూ కథను చివరి వరకూ తీసుకువెళ్లి శుభం కార్డ్ వేయడం. బ్లాక్ అండ్ వైట్ కాలం నుండి ఇలాంటి కథలు చాలానే వచ్చాయి.

ఇదే తరహా కథతో ‘సూర్యకాంతాన్ని ఫ్రెష్‌గా చూపించే ప్రయత్నంలో రొటీన్ ఫార్ములానే ఫాలో అయిపోయారు. రొటీన్ కథను డిఫరెంట్‌గా ప్రజెంట్ చేయాలనే ఆలోచన బావుంది కాని.. తెరకెక్కించిన విధానం కన్విన్సింగ్‌గా లేదు. కామెడీ జిమ్మిక్కులతో కథను నడిపిస్తూ తాను కన్ఫ్యూజ్ అవుతూనే ప్రేక్షకుల్నీ కన్ఫ్యూజన్‌లో పడేశారు. ఫస్టాఫ్ మొత్తాన్ని సాఫీగా లాగించిన దర్శకుడు సెకండాఫ్‌లో స్లోనరేషన్‌తో విసుగుతెప్పించారు. ఇంటర్వెల్ బ్యాంగ్‌తో సెకండాఫ్‌ ఎలా సాగుతుందో చెప్పేసిన దర్శకుడు.. ప్రేక్షకుడి అంచనాలను దాటి ఆలోచించలేకపోయాడు.

ట్విస్ట్‌లు చాలానే ఉన్నా మూవీ రన్ టైం‌ని నడిపించడం కోసమే తప్ప అవి కథలో భాగం కాలేకపోయాయి. ఇక క్లైమాక్స్ ఎప్పుడొస్తుందా.. అని ఎదురుచేసే పరిస్థితి. చివరి అరగంట సినిమా అయిపోయిందా.. ఇదేనా క్లైమాక్స్ అనుకునేలోపు మరో సీన్ రావడం.. మళ్లీ క్లైమాక్స్ కోసం చూడటం ఇలా బోరింగ్ సన్నివేశాలతో ప్రేక్షకుల సహనానికి పరీక్షపెట్టాడు. ఎప్పటిలాగే నిహారిక గొప్పగా చేయలేదు కాని.. తనకు వచ్చినట్టు చేసింది. బహుషా దర్శకుడు ప్రవీణ్ బ్రహ్మాండపల్లి నిహారికను ఊహించుకునే ఈ కథను రాసుకున్నట్టు ఉన్నాడు.

అందుకే ఆమెను ఢీ డాన్స్ షోలోనూ ఇంటర్వ్యూలలోనూ చూస్తున్న ఫీలింగే కలిగింది తప్పతే.. పెద్దగా నటిస్తున్నట్టు అనిపించదు. అయితే ఎమోషన్స్ సీన్లలో మునుపటి కంటే బెటర్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. ఆమె పాత్రకోసం డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ సెట్ కాలేదు. హెయిర్ స్టైయిల్స్ అయితే ఇదేం అవతారం అనిపిస్తుంది. సూర్యకాంతం ప్రాస కోసం పాకులాడుతూ పేల్చిన డైలాగ్స్ అక్కడక్కడా పేలినా.. ఆ పంచ్‌ల ప్రవాహాన్ని తట్టుకోవడం కష్టమే. కొత్త హీరోయిన్ పెర్లెన్ భేసానియా పరిధిమేర బాగానే నటించింది.

ఇక తొలి చిత్రంతో హీరోగా నిరూపించుకున్న రాహుల్ విజయ్.. అభి పాత్రలో ఒదిగిపోయాడు. లవ్ ఎమోషన్స్ సీన్స్‌లో హావభావాలను పలికించగలిగాడు. ఇద్దరి హీరోయిన్స్ కంటే మెరుగైన పెర్ఫామెన్స్ ఇచ్చారు. సూర్యకాంతం తల్లిగా నటించిన సుహాసిని కనిపించిన రెండు మూడు సీన్లలో సీనియారిటీ నిరూపించుకుంది. కాని ఆమె పాత్రను అవసరం లేకపోయినా చంపేయడంతో రెండు మూడు సీన్లకే పరిమితం అయ్యింది. హరిజ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ బావుంది. మార్క్ కె రాబిన్ మ్యూజిక్ సినిమాకి ప్లస్ అయ్యింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.