న్యూజిలాండ్‌ మసీదుల్లో కాల్పులు – 27 మంది మృతి

న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌ నగరంలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. నగరంలోని రెండు మసీదుల్లో గుర్తుతెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం కావడంతో మసీదు వద్ద ప్రార్థనలు చేసే ముస్లింల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వీరిని లక్ష్యంగా చేసుకుని దుండగులు దాడికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు.
నల్లరంగు దుస్తులు ధరించిన ఓ వ్యక్తి తొలుత అల్‌ నూర్ మసీదులోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 27 మంది మృతిచెందినట్లు స్థానిక మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. అయితే ఘటనా సమయంలో అల్‌ నూర్‌ మసీదులో దాదాపు 300 మంది ఉన్నట్లు తెలుస్తోంది. మసీదులో చాలా మృతదేహాలు పడి ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దాడి సమయంలో బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు సభ్యులు కూడా మసీదులోనే ఉన్నారు. అయితే అదృష్టవశాత్తు వారంతా ప్రాణాలతో బయటపడ్డారు.
ఈ ఘటన జరిగిన కొద్ది క్షణాలకే లిన్‌వుడ్‌ మసీదులో మరో ఆగంతుకుడు కాల్పులు జరిపాడు. ఒంటినిండా ఆయుధాలతో ఉన్న ఓ వ్యక్తి మసీదులోకి చొరబడి కాల్పులకు తెగబడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ మసీదు వద్ద పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

ఘటనాస్థలం వద్దే దుండగుడు..
మరోవైపు దాడికి పాల్పడిన దుండగుడు ఇంకా ఘటనా స్థలం వద్దే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటి వరకు భద్రతాసిబ్బంది ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అతడు కాల్పులు జరిపాడా? లేదా వారికి సహకరించడానికి అక్కడకు వచ్చాడా? అన్నది తెలియాల్సి ఉంది.

లైవ్‌స్ట్రీమ్‌ చేస్తూ కాల్పులు..
అల్‌ నూర్‌ మసీదు వద్ద కాల్పులకు తెగబడ్డ దుండగుడు దాడినంతా ప్రత్యక్ష ప్రసారం చేసినట్లు న్యూజిలాండ్‌ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. మొత్తం 17 నిమిషాల పాటు ఈ లైవ్‌ స్ట్రీమింగ్‌ జరిగినట్లు తెలిపాయి. ఆ వీడియో ప్రకారం దుండగుడు ఆస్ట్రేలియాకు చెందిన బ్రెంటన్‌ టారెంట్‌గా తెలుస్తోంది. కారులో వచ్చిన దుండగుడు అల్‌ నూర్‌ మసీదుకు దగ్గరగా వాహనాన్ని నిలిపాడు. ఆ తర్వాత మసీదులోకి చొరబడి కాల్పులకు పాల్పడ్డాడు. అయితే ఈ లైవ్‌స్ట్రీమ్‌ వీడియోను షేర్‌ చేయరాదంటూ న్యూజిలాండ్‌ పోలీసులు ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇది చీకటి రోజు..
ఘటనపై న్యూజిలాండ్‌ ప్రధాని జెసిందా ఆర్డెర్న్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ చీకటి రోజుల్లో ఇది ఒకటని, హింసకు తీవ్రమైన రూపమని ఆమె పేర్కొన్నారు. ఘటన నేపథ్యంలో ఆమె వెల్లింగ్టన్‌ బయల్దేరారు.