గ్రూపు-2 స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహణ కోసం 727 కేంద్రాలు సిద్ధం

ఈ నెల 5వ తేదీన నిర్వహించే గ్రూపు-2 స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రకటించింది.విజయవాడలో మంగళవారం సాయంత్రం కమిషన్‌ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ ఉదయ్‌భాస్కర్‌ సహచర సభ్యులతో కలిసి విలేకర్లతో మాట్లాడారు.‘‘ఈ పరీక్షను 2,95,036 మంది అభ్యర్థులు రాయబోతున్నారు. వీరి కోసం 727 కేంద్రాలను ఏర్పాటుచేశాం. గరిష్ఠంగా విశాఖ జిల్లాలో 106, కనిష్ఠంగా నెల్లూరులో 31 కేంద్రాల ఏర్పాటయ్యాయి. కమిషన్‌ కార్యాలయంలోనే కాకుండా జిల్లా స్థాయిలో ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు కాబోతున్నాయి. ఈ కేంద్రాల నంబర్లను పరీక్షకు ముందురోజు కమిషన్‌ వెబ్‌సైట్‌లో ప్రకటిస్తాం’’ అని ఆయన వివరించారు. ఈ పరీక్షలో రుణాత్మక మార్కులు ఉన్నందున అభ్యర్థులు తగిన జాగ్రత్తలతో జవాబులు గుర్తించాలని ఆయన సూచించారు. ‘‘కొత్తగా ఓఎంఆర్‌కు సంబంధించి ఓ నిర్ణయాన్ని అమలు చేస్తున్నాం. దానిపై వృత్తాలు నింపే సమయంలో దానిని నలిగిపోకుండా చూడాలి. పరీక్ష నిర్వహకులను సంప్రదిస్తే అవసరమైతే కొత్త ఓఎంఆర్‌ ఇస్తారు. ప్రశ్నపత్రం సీరిస్‌ను వృత్తాలతో నింపేటప్పుడు తగిన జాగ్రత్త తీసుకోవాలి. నలుపు లేదా నీలం బాల్‌పెన్నును మాత్రమే ఉపయోగించాలి’’ అని చెప్పారు.

ఆంగ్లంలో ప్రశ్నలే ఆధారం
గ్రూపు-3లో తెలుగులో ఇచ్చిన ప్రశ్న- జవాబుల్లో తప్పులు దొర్లడాన్ని ప్రశ్నించగా ‘‘ఆంగ్లంలో ఇచ్చిన ప్రశ్నలు, జవాబులను మాత్రమే పరిగణనలోనికి తీసుకుంటాం. దీనిగురించి ముందుగానే అభ్యర్థులకు తెలియచేశాం. తెలుగు అనువాదంలో పూర్తిగా అర్థం మారేలా ఉంటే తప్పకుండా ఆ విషయాన్ని పరిశీలించి తగిన నిర్ణయాన్ని తీసుకుంటాం’’ అని ఉదయభాస్కర్‌ చెప్పారు. బీటెక్‌ను ఆంగ్లంలోనే పూర్తిచేసినందున సాంకేతిక ఉద్యోగాల రాత పరీక్షకు అదే మాధ్యమంలో ప్రశ్నలు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. తెలుగు మాధ్యమానికి ప్రాధాన్యం తగ్గించాలన్న ఆలోచన కమిషన్‌కు అసలు లేదని ఆయన స్పష్టం చేశారు. గ్రూపు-2 పరీక్ష ఉన్న రోజునే ఎల్‌ఐసీ పరీక్ష ఉండటాన్ని ప్రస్తావించినప్పుడు.. తాము ముందుగానే పరీక్ష తేదీతో నోటిఫికేషన్‌ జారీచేశామని, మరో పరీక్ష అదే రోజు జరుగుతుంటే ఏమీ చేయలేమని చెప్పారు. సంబంధిత అభ్యర్థులు అర్థం చేసుకుని ఏ పరీక్ష రాయాలన్న దానిపై ఓ నిర్ణయానికి రావాలని చెప్పారు. విలేకర్ల సమావేశంలో సభ్యులు విజయకుమార్‌, రామరాజు, సుజాత, సేవరూప పాల్గొన్నారు.