కరోనా భయంతో ఆత్మహత్య

సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న కరోనా భయం ఒకరి ప్రాణం తీసింది. ఈ వైరస్ గురించి అవగాహన లేని ఒక రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే ఏపీలోని చిత్తూరు జిల్లా తోట్టంబేడు మండలం శేషమనాయుడు కండ్రిగకు చెందిన బాలకృష్ణకు 50 సంవత్సరాలు. జ్వరం, దగ్గుతో మూడు రోజుల క్రితం రుయాస్పత్రిలో ఆయన చేరి చికిత్స తీసుకున్నాడు. అయితే సాధారణ వైరల్ ఫీవర్ కావడంతో ఆయనను డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపారు రుయా వైద్యులు. తనకు కరోనా వైరస్ అని గ్రామస్తుల ముందు చెప్పుకుని బాధ పడిన ఆయన కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతో పొలం వద్ద ఉన్న తల్లి సమాధి వద్దే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు.