గూగుల్లో అత్యధికంగా వెతికిన జాబితాలో అభినందన్, సారా అలీఖాన్

ఈ ఏడాదిగానూ పాకిస్తానీయులు గూగుల్‌లో అత్యధికంగా వెదికిన వ్యక్తుల జాబితాలో భారత వైమానిక దళ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌, బాలీవుడ్‌ హీరోయిన్‌ సారా అలీఖాన్‌లు టాప్‌-10లో ఉన్నారు. పాకిస్తాన్‌లో అత్యధిక మంది వీరికి సంబంధించిన సమాచారం గురించే వెదికినట్లు సెర్చ్‌ ఇంజన్‌ దిగ్గజం గూగుల్‌ వెల్లడించింది. అదే విధంగా ఇండియన్‌ టీవీ రియాలిటీ షో బిగ్‌బాస్‌- 13, మోటూ పాట్లూ షోపై కూడా వారు అత్యంత ఆసక్తిని చూపారని తెలిపింది.


ఆర్టికల్‌ 370 అంటే ఏమిటి ?, అయోధ్య కేసు ఏమిటి ?, జాతీయ పౌర రిజిస్టర్‌ (ఎన్‌ఆర్సీ) అంటే ఏమిటి ? ఎగ్జిట్‌ పోల్స్, బ్లాక్‌హోల్, హౌడీ–మోడీలను శోధించారు. క్రికెట్‌ వరల్డ్‌ కప్‌తోపాటు లోక్‌సభ ఎన్నికల గురించి అత్యధిక మంది సెర్చ్‌ చేశారు. చంద్రయాన్‌–2, నీట్‌ ఫలితాలు, పీఎం కిసాన్‌ యోజన, కబీర్‌ సింగ్, అవెంజర్స్‌ ఎండ్‌ గేమ్, కెప్టెన్‌ మార్వెల్‌ గురించీ వెదికారు. వ్యక్తుల గురించి చేసిన శోధనలో.. ‘ఐఏఎఫ్‌ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌’ తొలిర్యాంక్‌ సాధించారు. తర్వాత లతా మంగేష్కర్, యువరాజ్‌ సింగ్, ‘సూపర్‌ 30’ ఆనంద్‌ వంటివారు ఉన్నారు.