ఏప్రిల్ 1 నుంచి హెచ్ 1బీ వీసాల దరఖాస్తుల స్వీకరణ

2020 ఆర్థిక సంవత్సరానికి గానూ కొత్త హెచ్‌-1బీ వీసా దరఖాస్తుల్ని ఏప్రిల్‌ 1నుండి స్వీరించన్నుట్లు అమెరికా పౌరసత్వ, వలసల సేవల సంస్థ యూఎస్‌సీఐఎస్‌ ప్రకటించింది. ఈ వీసాలు పొందిన వారి ఉద్యోగ జీవితకాలం అక్టోబర్‌ 1న ప్రారంభమవుతుందని అమెరికా బజార్‌ అనే దినపత్రిక తెలిపింది. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా హెచ్‌1బీ వీసాల సంఖ్యను 65 వేలకు పరిమితం చేశారు.

అమెరికా వర్సిటీల్లో మాస్టర్స్‌ లేదా ఇతర ఉన్నత పట్టాలు పొందిన వారికి మరో 20 వేలు అదనంగా ఈ తరహా వీసాలు జారీ కానున్నాయి. ఈ ఏడాది తొలినాళ్లలో వీసా మంజూరు నిబంధనలు మారిన నేపథ్యంలో ధ్రువపత్రాల పరిశీలన, ఇతర నిబంధనలు కఠినంగా అమలవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీసాలు పొందే అడ్వాన్స్‌డ్‌ డిగ్రీ అభ్యర్థుల సంఖ్య 16 శాతం పెరుగుతుందని యూఎస్‌సీఐఎస్‌ అంచనా వేస్తోంది.