న్యాయ్‌ పథకం కింద నిరుపేదలందరికీ ఏటా రూ.72 వేలు

అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ తెలిపారు. లోక్‌సభ, రాజ్యసభతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో ఈ కోటాను అమలుచేస్తామని వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌లో ఉన్న పిపరియాలో నిర్వహించిన ర్యాలీలో రాహుల్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘దేశంలోని నిరుపేదలందరికీ న్యాయ్‌ పథకం కింద ఏటా రూ.72 వేలు అందజేస్తాం.

ఈ మొత్తాన్ని మహిళల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తాం. ఈ పథకం మన ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజం చేస్తుంది. పెద్దనోట్ల రద్దు కారణంగా సామాన్యుల దగ్గర నగదు లేకుండా పోయింది. న్యాయ్‌ వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. తద్వారా ఆర్థిక వ్యవస్థలోకి నగదు ప్రవాహం జోరందుకుంటుంది’ అని పేర్కొన్నారు. 2014 తర్వాత దేశంలో బాంబు పేలుళ్లు విన్పించలేదన్న మోదీ వ్యాఖ్యలపై రాహుల్‌ ..‘పఠాన్‌కోట్, ఉడీ, పుల్వామా, గడ్చిరోలి.. గత ఐదేళ్లలో మొత్తం 942 ఉగ్రదాడులు జరిగాయి. చెవులు తెరిచి వింటే ఈ పేలుళ్లు విన్పిస్తాయి’ అని చురకలు అంటించారు.