విశాఖలోని LG పాలిమర్స్ పరిశ్రమలో భారీ ప్రమాదం

గురువారం తెల్లవారుజామున విశాఖపట్టణంలో భారీ ప్రమాదం సంభవించింది. గోపాలపట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి భారీగా స్టైరీన్‌ గ్యాస్ లీకై దాదాపు మూడు కిలోమీటర్ల మేర వ్యాపించింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రసాయనంతో దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావడంతో స్థానికులు అనారోగ్యానికి గురయ్యారు.

కొందరు అపస్మాకరకస్థితిలో రోడ్డుపై పడిపోయారు. వెంటనే ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. అనారోగ్యానికి గురైన వారిని అంబులెన్స్‌లో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.

సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితి సమీక్షించారు. వెంటనే ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా ఆదేశించారు. ఐదు కిలోమీటర్ల ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఇళ్ల నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. రసాయన వాయువు లీకేజీని అరికట్టేందుకు అధికారులు, సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.