ఏపీ సరిహద్దుల్లో కట్టిన గోడలను కూల్చేసిన అధికారులు

ఎవరి నుంచి ఎవరికి కరోనా సోకుతుందేమోనని ఆందోళన చెందుతున్న నేపథ్యంలో తమిళనాడు అధికారులు కూడా కరోనా వ్యాపించకుండా ఉండేందుకు మరో రకం చర్యలు తీసుకున్నారు. ఏపీ-తమిళనాడు సరిహద్దుల్లో రోడ్డు మీద గోడలు కట్టి రాకపోకలు జరగకుండా చేశారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా రాకపోకలను నిలిపివేసినట్లు వేలూరు జిల్లా అధికారులు చెప్పారు.

అయితే తమిళనాడు అధికారుల తీరుతో చుట్టు పక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. మీడియాలోనూ వరుస కథనాలు రావడంతో ఎట్టకేలకు తమిళనాడులోని వేలూరు కలెక్టర్ దిగొచ్చారు. ఆంధ్రా సరిహద్దుల్లో రోడ్డుకు అడ్డంగా కట్టిన ఆ గోడలను ప్రొక్లెయినర్లతో కూల్చివేయించారు.

వేలూరు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రోడ్డుకు అడ్డంగా 6 అడుగుల ఎత్తున రాత్రికి రాత్రే గోడలను కట్టేశారు. పలమనేరు సమీపంలోని గుడియత్తాం వెళ్లే రహదారి, తిరుత్తణి మార్గంలోని శెట్టింతంగాళ్‌తో పాటు బొమ్మ సముద్రం నుంచి తమిళనాడు వెళ్లే మార్గాలకు అడ్డంగా గోడలను నిర్మించారు. దీంతో అధికారుల తీరుపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక చేసేదేమీలేక తమిళనాడు అధికారులు గోడలను కూల్చివేశారు.