ప్రపంచ దేశాలలో మరో కొత్త దేశం

ప్రపంచ దేశాల పటంలో మరో కొత్త దేశం చేరింది. పపువా న్యూ గునియా నుంచి వేరుపడిన బౌగెన్‌విల్లే స్వతంత్ర రాజ్యంగా రూపుదిద్దుకుంటుంది. బుకా పట్టణం ఈ కొత్త దేశ రాజధానిగా ఉంటుందని, అన్ని ప్రభుత్వ ప్రధాన కార్యాయాలు అక్కడే నెలకొంటాయని అధికారులు తెలిపారు. సుమారు 3 లక్షల మంది జనాభా కలిగిన బౌగెన్‌విల్లే దేశంలో బుకాతోపాటు అరావా, బూయిన్ మాత్రమే చెప్పుకోదగ్గ నగరాలు. ఈ దేశంలో నివసిస్తున్న జనాభాలో మలేషియా నుంచి వచ్చినవారే. స్థానికులు మాత్రం టోక్ హిసిన్ భాష మాట్లాడతారు. పపువా న్యూ గునియా పిడ్గిన్ ఇంగ్లీష్‌ను మాట్లాడేవారు కూడా ఉన్నారు.  1768లో ఈ తీర ప్రాంతం నుంచి ప్రయాణిస్తూ ద్వీపాన్ని కనుక్కొన్న ఫ్రెంచ్ నావికుడు లూయిస్ ఆంటానియో డి బౌగెన్‌విల్లే పేరుతో ఆ ద్వీపానికి నామకరణం చేశారు. 1969లో అతి పెద్ద రాగి గనుల సంస్థ బౌగెన్‌విల్లే కాపర్ లిమిటెడ్ ఏర్పాటైంది. విస్తారమైన ఖనిజ సంపద ఈ దేశానికి ఉంది. అందులో రాగి ప్రధానమైంది. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న రాగిలో బౌగెన్‌విల్లేది 7 శాతం కావడం గమనార్హం. ఈ నిక్షేపాలను కాపాడుకోవడానికి స్థానికులు చాలాకాలంగా పోరాటం చేస్తున్నారు. అంతర్యుద్ధంలో సుమారు 20వేల మంది మృతి చెందారు. అంతర్జాతీయ సమాజం తీవ్ర ఒత్తిడిని తీసుకురావడంతో బౌగెన్‌విల్లేను పపువా న్యూ గునియా స్వతంత్ర రాజ్యంగా త్వరలోనే ప్రకటించనుంది.