తెలంగాణ ఇంటర్‌ మార్కుల పున:లెక్కింపు కారణంగా ఏపీ ఎంసెట్‌ ఫలితాలు వాయిదా

తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో జాప్యం కారణంగా ఏపీ ఎంసెట్‌ ఫలితాలను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ విజయరాజు ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ఇంటర్‌ మార్కుల పున:లెక్కింపు, పరిశీలన అనంతరం ఈనెల 27న ఫలితాలు ప్రకటించనున్నట్లు తెలంగాణ ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి వెల్లడించారని పేర్కొన్నారు. తెలంగాణకు చెందిన సుమారు 36,698 మంది విద్యార్థులు ఏపీ ఎంసెట్‌ రాశారని, ఈ నేపథ్యంలో ఫలితాలను వాయిదా వేస్తున్నట్లు వివరించారు.

షెడ్యూల్‌ ప్రకారం ఏపీ ఎంసెట్‌ ఫలితాలను 18వ తేదీ శనివారం ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే తెలంగాణ ఇంటర్‌ విద్యామండలి ఏపీ ఎంసెట్‌ కన్వీనర్‌కు మార్కుల జాబితాను ఇచ్చింది. వీటి ఆధారంగా ర్యాంకులు కేటాయించి ఫలితాలు విడుదల చేయాలని ఉన్నత విద్యామండలి భావించింది. తెలంగాణలో ఇంటర్‌ మార్కుల పున:లెక్కింపు, పరిశీలనకు ఎక్కువ మంది దరఖాస్తు చేయడం, హైకోర్టు ఆదేశాలు ఉండడంతో ఫలితాలను వాయిదా వేయాలని నిర్ణయించారు.

డీఈఈసెట్‌కు 80.7% హాజరు
డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఈఈ)సెట్‌ పరీక్షలు గురువారంతో ముగిశాయి. రెండు రోజులపాటు నిర్వహించిన ఈ ఆన్‌లైన్‌ పరీక్షలకు 18,726 మంది హాజరయ్యారు. మొత్తం 23,215 మంది దరఖాస్తు చేశారు. అభ్యర్థులు తమ ప్రశ్నాపత్రాలతోపాటు జవాబుపత్రాలు, ప్రాథమిక ‘కీ’ని https://cse.ap.gov.in, https://apdeecet.apcfss.in వెబ్‌సైట్ల నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కన్వీనర్‌ పార్వతి తెలిపారు.

ఎల్పీసెట్‌కు రుసుము చెల్లింపు గడువు 18 వరకు
తెలుగు, హిందీ పండిత శిక్షణ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎల్పీసెట్‌కు రుసుము చెల్లించేందుకు ఈనెల 18 తుది గడువు అని కన్వీనర్‌ పార్వతి తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణకు 19వరకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. అభ్యర్థులు పూర్తి వివరాలను వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.