జట్టులో వార్నర్‌, స్మిత్‌ ఉంటే ప్రపంచకప్‌ ఆస్ట్రేలియాదే

స్టీవ్‌స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌ జట్టులో చేరితే ఆస్ట్రేలియా తిరిగి ప్రపంచకప్‌ టైటిల్‌ను నిలబెట్టుకొనే అవకాశం ఉంటుందని ఆ దేశ మాజీ క్రికెటర్‌ రికీ పాంటింగ్‌ అన్నాడు. వీరిద్దరి చేరిక జట్టును మరింత బలంగా మారుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. ప్రపంచకప్‌ వరకు పాంటింగ్‌ను క్రికెట్‌ ఆస్ట్రేలియా సహాయ కోచ్‌గా నియమించిన సంగతి తెలిసిందే.

‘ప్రస్తుతం భారత్‌, ఇంగ్లాండ్‌ చాలా పటిష్ఠంగా ఉన్నాయి. మేం వార్నర్‌, స్మిత్‌ను మా బ్యాటింగ్‌ లైనప్‌లో చేరిస్తే మా జట్టు మరింత బలంగా మారుతుంది. ఇంగ్లాండ్‌లోని పరిస్థితులు మా ఆటకు సరిపోతాయి. ఇలాంటి మెగా టోర్నీలకు ఏం అవసరమో తెలుసు. ఆరంభం నుంచే నేను ప్రభావం చూపగలను. కుర్రాళ్ల స్పందన సైతం బాగుంది. ప్రపంచకప్‌ ముందు వార్నర్‌, స్మిత్‌, బాన్‌క్రాఫ్ట్‌ జట్టులో చేరితో చాలా దేశాల కన్నా మా జట్టు బాగుంటుంది. నేను భాగస్వామిగా ఉండే జట్టు సీనియర్లు, యువకులతో సమతూకంగా ఉంటుంది’ అని పాంటింగ్‌ అన్నాడు.