పంచాయతీ ఎన్నికలకు బ్యాలెట్‌ పత్రాలే ఉపయోగిస్తాం

గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు మూడు దశల్లో నిర్వహించేలా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం విజయవాడలో ఆయన ఎన్నికల ముందస్తు ఏర్పాట్లపై పంచాయతీరాజ్‌, పురపాలకశాఖల ఉన్నతాధికారులతో ప్రాథమిక సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చే ప్రభుత్వం పంచాయతీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను పునః సమీక్షించి సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా తగు నిర్ణయాన్ని తీసుకోవాల్సివుందని, తెలంగాణలోనూ ఇలాంటి నిర్ణయాన్నే తీసుకొని ఎన్నికలు నిర్వహించారని వివరించారు. ఈ ప్రక్రియ ముగిశాక పార్టీ రహితంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రకటన జారీ చేస్తామని ఎన్నికల కమిషనర్‌ తెలిపారు.

పంచాయతీ ఎన్నికలకు గతంలో మాదిరిగా బ్యాలెట్‌ పత్రాలే వినియోగిస్తామని రమేశ్‌కుమార్‌ చెప్పారు. సర్పంచి, వార్డు సభ్యులుగా పోటీ చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్యాలెట్‌ పత్రాల వినియోగమే మేలని భావిస్తున్నామని తెలిపారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, పురపాలక ఎన్నికలకు ఈవీఎంలు వినియోగిస్తామని, గతంలో ఉపయోగించినవే మళ్లీ సర్వీసింగ్‌ చేయించి కలెక్టర్ల ఆధ్వర్యంలో సిద్ధం చేస్తామని వివరించారు. వీటి వినియోగంలో అధికారులకు ఎంతో అనుభవం ఉందని, సిబ్బందికి కూడా శిక్షణ ఇస్తామని, ఎలాంటి ఇబ్బందులు ఉండవని కచ్చితంగా చెప్పగలనన్నారు.సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలున్నందున అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో వీవీప్యాట్‌లు ఉపయోగించారని, రాష్ట్ర ఎన్నికల సంఘానికి అలాంటి ఆదేశాల్లేవని స్పష్టం చేశారు.

అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఉపయోగించిన ఓటర్ల జాబితాల ఆధారంగా పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేసి ఈనెల 10నే విడుదల చేయాలని పురపాలక, పంచాయతీరాజ్‌ శాఖాధిపతులకు ఆదేశాలిచ్చామని ఎన్నికల కమిషనర్‌ తెలిపారు. ఈ సమావేశంలో బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ, సరఫరా, ఎన్నికల నిర్వహణకు అవసరమైన నిధుల సమీకరణకు ఆర్థికశాఖ సంసిద్ధతను వ్యక్తం చేసిందన్నారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వశాఖల అధికారులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా జిల్లా స్థాయిలో కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు త్వరలో సమావేశాలు నిర్వహించి కార్యాచరణ సిద్ధం చేస్తారని వివరించారు. సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌, సంచాలకుడు కన్నబాబు, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ సంచాలకులు రంజిత్‌భాషా, ఆర్థికశాఖ అధికారులు పాల్గొన్నారు.