సెక్షన్లు 153ఏ, 295ఏ కింద కమల్‌హాసన్‌పై కేసు నమోదు

నటుడు, మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. తమిళనాడులో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతుండగా అరవకురిచ్చిలో ఈనెల 12న కమల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ‘గాంధీ విగ్రహం ముందు నిలుచుని చెబుతున్నా స్వాతంత్య్ర భారతావనిలో తొలి తీవ్రవాది ఒక హిందువు. అతని పేరు నాథూరాం గాడ్సే’ అని పేర్కొన్నారు. దీంతో ఆయనపై మత విశ్వాసాలను రెచ్చగొట్టినందుకు, విద్వేషాలను ప్రేరేపించినందుకు సెక్షన్లు 153ఏ, 295ఏ కింద కేసులు నమోదు చేసినట్లు కరూర్‌ జిల్లా పోలీసులు తెలిపారు.

ఈ వ్యాఖ్యలకు నిరసనగా కన్యాకుమారి జిల్లా నాగర్‌కోవిల్‌లో ‘హిందూ మున్నాని’ నేతలు కమల్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ పరిణామంతో పోలీసులు చెన్నై ఆళ్వార్‌పేట, ఈసీఆర్‌ రోడ్డులోని కమల్‌ నివాసాలు, పార్టీ కార్యాలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. మత విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా ఎన్నికల నిబంధనలను అతిక్రమించిన ఎంఎన్‌ఎం పార్టీ గుర్తింపును రద్దు చేయాలని, ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా కమల్‌పై నిషేధం విధించాలంటూ బీజేపీ తరఫున న్యాయవాది అశ్వనీకుమార్‌ ఢిల్లీ హైకోర్టులో మంగళవారం పిల్‌ దాఖలు చేశారు. కాగా, కమల్‌ వ్యాఖ్యలను బీజేపీ, ఏఐఏడీఎంకే ఖండించగా, కాంగ్రెస్, డీఎంకే సమర్థించాయి.