అమరావతి రాజధానిగా సరిపోదని ప్రకటించిన చెన్నై ఐఐటి

అమరావతిలో రాజధాని నిర్మాణం సరైనది కాదని రాజధాని నిర్మాణానికి అమరావతి ప్రాంతం ఏమాత్రం అనుకూలంగా లేదని.. వరద ముప్పు పొంచి ఉందని.. చెన్నై ఐఐటీ(ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ) తేల్చి చెప్పింది. ఈ ప్రాంతంలో 40 మీటర్ల కంటే ఎక్కువ తవ్వితేగాని రాయిపోర లేదని చెప్పింది. పునాదులు అంత లోతు తవ్వాలంటే ఖర్చు భారీగా పెరుగుతుందని వివరించింది. అంతేకాదు ర్యాప్ట్‌ ఫౌండేషన్‌ ఇక్కడ ఉపయోగం లేదని చెన్నై ఐఐటీ స్పష్టం చేసింది. అలాగే ఈ ప్రాంతాన్ని కనీసం 3–4 మీటర్ల మేర మట్టిని ఏర్పాటు చెయ్యాలని.. ఇందుకు భారీ వ్యయం చేయాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే ఇక్కడ భూగర్భజలాలు తక్కువ లోతులోనే లభ్యమవుతాయని.. అందువల్ల ఈ భూములు భారీ భవన నిర్మాణాలకు అనుకూలం కావని వెల్లడించింది.

ప్రభుత్వ భవనాల సముదాయం తోపాటు స్పోర్ట్స్‌ కాంప్లెక్స్, ఫైనాన్స్‌ సిటీ, టూరిజం సిటీల పనులు చేపట్టనున్న ప్రాంతాలపై వరదల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది. కృష్ణా నది, కొండవీటి వాగులకు వరద వస్తే రాజధాని గ్రామాల్లో 71 % ప్రాంతంలో 0.5 నుంచి 1 మీటరు ఎత్తున నీళ్లు చేరే ప్రమాదం ఉందని చెన్నై ఐఐటీ తేల్చి చెప్పింది. కాగా అమరావతిలో పెద్ద పెద్ద భవనాల నిర్మాణం సాధ్యం కాదని శివరామకృష్ణన్ కమిటీ తోపాటు నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్ ఇటీవల బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌(బీసీజీ)లు కూడా నివేదికలు ప్రభుత్వానికి అందించిన సంగతి తెలిసిందే.