డివైఎఫ్‌ఐ గుంటూరు సంబరాలు ముగిసాయి

డివైఎఫ్‌ఐ గుంటూరు తూర్పు జిల్లా కమిటీ ఆధ్వర్యాన గుంటూరు నగరంలో స్వామి వివేకానంద జయంతి, సంక్రాంతి పండుగ నేపథ్యంలో రెండురోజులపాటు నిర్వహించిన క్రీడా, సాంస్కృతిక పోటీలు ఆదివారంతో ముగిశాయి. 17 అంశాల్లో నిర్వహించిన పోటీల్లో జిల్లావ్యాప్తంగా అనేక మండలాలు, కాలేజీల నుంచి యువతీ యువకులు పాల్గొన్నారు. రెండో రోజు రంగోలి, లఘు నాటిక, జానపద నృత్యం తదితర పోటీల్లో ప్రదర్శనలు ఆద్యంతం అలరించాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు సభకు నిర్వహణ కమిటీ అధ్యక్షులు డాక్టర్‌ ఎం.బోసుబాబు అధ్యక్షత వహించారు. కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ కెఎస్‌.లక్ష్మణరావు ముఖ్యఅతిథిగా పాల్గొని పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. యువతను ప్రోత్సహించటానికి డివైఎఫ్‌ఐ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి సూర్యారావు మాట్లాడుతూ స్వామి వివేకానంద స్పూర్తితో విద్యార్థులు పడిలేచే కెరటం మాదిరిగా జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా పోరాట స్ఫూర్తితో ముందుకు వెళ్లాలన్నారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.సుందరయ్య, బి.లక్ష్మణరావు పాల్గొన్నారు.