ఆలస్యం కానున్న ఎంసెట్‌-2019 ఫలితాలు

ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో ఇంటరు విద్యలో గ్రేడింగ్‌ విధానం, తెలంగాణలో ఇంటరు ఫలితాల్లో గందరగోళ పరిస్థితుల కారణంగా ఏపీ ఎంసెట్‌-2019 ఫలితాల విడుదల ఆలస్యం కానుంది. రెండేళ్లుగా మే నెల ఐదో తేదీలోపే ర్యాంకులను ప్రకటిస్తుండగా.. ఈసారి 15 తర్వాతే వాటిని విడుదల చేయనున్నారు. ఎంసెట్‌లో ఇంటరు మార్కులకు 25% వెయిటేజీ ఉంది. గ్రేడ్‌ పాయింట్లను మార్కుల్లోకి మార్చుకోవడం కష్టమవుతున్నందున మార్కులే అందజేయాలని కన్వీనర్‌ కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంటరు మార్కులపై ఉన్నత విద్యాశాఖ, ఇంటరు విద్యామండలి అధికారులతో బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఎల్వీ సుబ్రమణ్యం సమీక్ష నిర్వహించారు.

ఎంసెట్‌ ప్రవేశాల ప్రక్రియ త్వరగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉన్నత విద్యాశాఖకు మార్కులను అందించాలని ఇంటర్‌ విద్యా మండలికి సూచించారు. దీంతోపాటు రాష్ట్రంలో కాపులకు 5%, ఆర్థిక బలహీన వర్గాలకు 5% రిజర్వేషన్‌ కోటా నిర్ధారించేందుకు చర్యలు చేపట్టాలని సీఎస్‌ ఆదేశించారు. ప్రస్తుతం పునఃలెక్కింపు, పునఃపరిశీలన (వెరిఫికేషన్‌) ప్రక్రియ కొనసాగుతున్నందున నాలుగైదు రోజుల్లో ఇది పూర్తయ్యాక ఎంసెట్‌ కన్వీనరుకు మార్కుల జాబితాను అందిస్తామని ఏపీ ఇంటర్‌ విద్యా మండలి వెల్లడించింది.