‘ఫొని’ ప్రభావం ఏపీపై తక్కువే

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘ఫొని’ తుపాను తీవ్ర రూపం దాల్చింది. తీవ్ర పెనుతుపానుగా మారింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రస్తుతం కొనసాగుతోంది. క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా తీరం వైపు కదులుతోంది. గడిచిన ఆరు గంటలుగా 7 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఒడిశాలోని పూరీకి 710 కిలోమీటర్లు, విశాఖకు 460 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 454 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాను మరింత బలోపేతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మధ్యాహ్నానికి దిశ మార్చుకుని ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉంది. ఈ నెల 3న మధ్యాహ్నాం ఒడిశాలోని పారాదీప్‌కు సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో 205 కిలోమీటర్ల ప్రచండ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఇప్పటికే తుపాను ప్రభావంతో బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.

తుపాను ప్రభావం ఏపీపై తక్కువగానే ఉండే అవకాశం ఉంది. అయితే ఈ నెల 2, 3 తేదీల్లో శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలు ఉన్నాయి. విశాఖ‌ప‌ట్నం జిల్లాలో ఒక మోస్తరు వ‌ర్షాలు కురిసే సూచ‌న‌లు కనిపిస్తున్నాయి. తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో తీరం వెంబడి గంట‌కు 80- 90 కిలోమీట‌ర్ల వేగంతో గాలులు వీచే అవ‌కాశ‌ం ఉంది. తుపాను గమనాన్ని రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది.

ప్రభావిత మండలాలు

శ్రీకాకుళం జిల్లా: గార‌, ఇచ్ఛాపురం, క‌విటి, కంచిలి, సోంపేట‌, మంద‌స‌, సంత‌బొమ్మాళి, ప‌లాస‌, పొలాకి, నందిగాం, వ‌జ్రపుకొత్తూరు, శ్రీకాకుళం

విజ‌య‌న‌గ‌రం: భోగాపురం, చీపురుప‌ల్లి, డెంకాడ‌, గ‌రివిడి, గుర్ల‌, నెల్లిమ‌ర్ల‌, పూస‌పాటిరేగ‌

విశాఖ‌ప‌ట్నం : భీమునిప‌ట్నం