మోదీకి క్లీన్‌చిట్‌ ఇచ్చిన ఎన్నికల సంఘం

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ‘భ్రష్టాచారి నంబర్‌ వన్‌’ వ్యాఖ్యలు ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కాదని ఈసీ స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలపై ప్రధాని మోదీకి ఎన్నికల సంఘం క్లీన్‌చిట్‌ ఇచ్చింది.

ఇటీవల ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ.. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని ఉద్దేశిస్తూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ‘మీ నాన్న(రాజీవ్‌గాంధీ) మిస్టర్‌ క్లీన్‌ అని ఆయన సన్నిహితులే పొగిడారు. కానీ ఆయన జీవితం భ్రష్టాచారి(అవినీతిపరుడు) నంబర్‌ వన్‌గా ముగిసింది’ అని మోదీ విమర్శించారు. రాజీవ్‌గాంధీ అవినీతిపరుడంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ మండిపడింది. ఆయన ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ ఈసీకి ఫిర్యాదు చేసింది.

ఈ ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల సంఘం.. మోదీకి క్లీన్‌చిట్‌ ఇచ్చింది. ‘ఫిర్యాదులో పేర్కొన్న మోదీ ప్రసంగాన్ని పరిశీలించాం. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఉన్న ఎన్నికల కోడ్‌ను మోదీ ఉల్లంఘించినట్లు మా పరిశీలనలో తేలలేదు. దీంతో ఈ ఫిర్యాదును కొట్టివేస్తున్నాం’ అని ఈసీ వర్గాలు వెల్లడించాయి.

ఇదిలా ఉండగా.. మోదీ చేస్తున్న వ్యాఖ్యలపై ఈసీ పలుమార్లు క్లీన్‌చిట్‌ ఇవ్వడంపై కాంగ్రెస్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రధాని విద్వేషపూరిత ప్రసంగాలను గుర్తించడంలో ఎన్నికల సంఘం విఫలమైందని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ ఎంపీ సుష్మితాదేవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది.