ఇంట్లో నాటుబాంబులు పేలడం వల్ల తీవ్రంగా గాయపడిన కుటుంబీకులు

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం యాతపేటలో బుధవారం మధ్యాహ్నం ఓ ఇంట్లో నాటుబాంబులు పేలాయి. ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. బాధితులను శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తీసుకొచ్చారు. ఆ తరువాత నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు.

యాతపేటలో ఎద్దిమింటి రమణ అడవి పందులను పట్టుకునేందుకు ఉపయోగించే మందుగుండు సామగ్రిని తీసుకొచ్చి ఇంట్లోనే బాంబులను తయారు చేస్తుంటారని సమాచారం. ఆ క్రమంలో ప్రమాదం సంభవించడంతో ఇల్లు పూర్తిగా కూలిపోయింది. దానికి సమీపంలోని రెండిళ్లకు బీటలు వారాయి. గాయపడిన వారిలో రమణ, ఆయన భార్య లక్ష్మి, రెండేళ్ల కుమారుడు నితిన్‌ ఉన్నారు. విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం ఉత్తరావల్లికి చెందిన అపన్న తీవ్రంగా గాయపడ్డారు. కొద్దిపాటి గాయాలతో బయటపడిన మిగిలిన ఐదుగురు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారే.