ప్రముఖ చైనా ఆర్కిటెక్ట్ ఐ.ఎం.పై మృతి

చైనా ప్రముఖ వాస్తుశిల్పి ఐ.ఎం.పై (102) కన్నుమూశారు. అమెరికాలోని న్యూయార్క్‌లో నివాసముంటున్న పై బుధవారం అర్థరాత్రి తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు తెలిపారు. ఐ.ఎం.పై 1917లో చైనాలో జన్మించారు. అనంతరం ఉన్నత విద్యాభ్యాసం నిమిత్తం అమెరికాకు వలస వెళ్లిన ఆయన మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, హార్వర్డ్‌ యూనివర్శిటీలో ఆర్కిటెక్ట్ రంగంలో ఉన్నత విద్యనభ్యసించారు. తక్కువ ఖర్చుతో భారీ భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలు, మ్యూజియం, హోటళ్ల నిర్మాణంలో పైగ సిద్ధహస్తులు.

బోస్టన్‌లోని అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్‌.ఎఫ్‌.కెన్నెడీ మెమోరియల్‌ లైబ్రరీ రూపకల్పనతో ఆయన ప్రపంచ ఖ్యాతి గడించారు. తన అద్భుత కళా నైపుణ్యంతో ప్రపంచలోని పలు కళాఖండాలకు ఆయన రూపమిచ్చారు. పారిస్‌లోని లౌవ్రే పిరమిడ్‌, హాంగ్‌ కాంగ్‌లోని 72 అంతస్థుల బ్యాంక్‌ ఆఫ్‌ చైనా, దోహాలోని మ్యూజియం ఆఫ్‌ ఇస్లామిక్‌ ఆర్ట్‌ ఆయన అద్భుత కళా నైపుణ్యానికి ప్రతీకలుగా నిలిచాయి. వీటితో పాటు అమెరికాలోని పలు అధికారిక భవనాలు, మ్యూజియంలకు ఆయనే రూపకల్పన చేశారు.