శ్రీకాకుళం జిల్లాలో మొదలైన ఫొని తుపాను ప్రభావం

పెను తుపాను ఫొని ప్రభావం మొదలైంది. శ్రీకాకుళం జిల్లాలోని సముద్ర తీర మండలాల్లో పరిస్థితులు మారుతున్నాయి. పలాస, టెక్కలి, సంతబొమ్మాళి, శ్రీకాకుళంలో వాన కురుస్తోంది. మిగిలిన సముద్ర తీర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడుతున్నాయి. ఇచ్ఛాపురం సహా పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా మీదుగా నడిచే పలు రైళ్లు రద్దయ్యాయి. తూర్పు కోస్తా రైల్వే పరిధిలోని మొత్తం 103 రైళ్లను అధికారులు రద్దు చేశారు.

అధికారుల అప్రమత్తం
ఫొని తుపాను నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తుపాను పునరావాస కేంద్రాల్లో పరిస్థితిని కలెక్టర్ నివాస్ ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ఇచ్ఛాపురం, సోంపేట, కవిటి, పలాస, మందస, టెక్కలి, కొత్తూరు, భామిని, శ్రీకాకుళంలో తొమ్మిది ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచారు. అగ్నిమాపక శాఖ బృందాలు, తుపాను ప్రభావిత మండలాల్లో ఐదు జేసీబీలు కూడా ఉంచామన్నారు. మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.