శుబ్‌మన్‌ పై ట్విటర్‌లో ప్రశంసల జల్లు

యంగ్‌ సెన్సేషన్‌ శుబ్‌మన్‌ గిల్‌ మరోసారి క్రికెట్‌ అభిమానుల హృదయాలను కొల్లగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఓవైపు శుబ్‌మన్‌ గిల్‌ రాణిస్తుంటే.. మరోవైపు అతని తండ్రి స్టెప్పులతో ప్రేక్షకుల గ్యాలరీలో హల్‌చల్‌ చేశారు. లోకల్‌ బాయ్‌ అయిన శుబ్‌మన్‌ గిల్‌ మొహాలీలో ఆడుతుండటంతో ఈ మ్యాచ్‌కు అతని తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. ప్రేక్షకుల గ్యాలరీలో ఉన్న తన పేరెంట్స్‌ను ఏమాత్రం డిసాపాయింట్‌ చేయకుండా శుబ్‌మన్‌ బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణించాడు. దీంతో అతడు భారీ షాట్స్‌ ఆడినప్పుడల్లా భంగ్రా స్టెప్పులతో హల్‌చల్‌ చేశాడు. కోల్‌కతా జట్టు యాజమాని షారుఖ్‌ ఖాన్‌ సైతం ఈ విషయాన్ని పసిగట్టి.. మ్యాచ్‌ అనంతరం తన ట్వీట్‌లో గిల్‌ ‘పప్పా‘ను ప్రత్యేకంగా అభినందించారు.

శుబ్‌మన్‌ భారీ రికార్డు..
కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో ఓపెనర్‌గా దిగిన శుబ్‌మన్‌.. ఆసాంతం క్రీజ్‌లో నిలిచి.. కోల్‌కతా విజయంలో కీలక పాత్ర పోషించాడు. 49 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో అజేయంగా 65 పరుగులు చేసిన గిల్‌ను ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’  వరించింది. అద్భుతమైన షాట్లు ఆడకపోయినప్పటికీ.. చక్కని స్ట్రోక్‌ప్లేతో, మంచి తెలివైన క్రికెటింగ్‌ షాట్లతో క్లాసీ ఆటతీరును శుబ్‌మన్‌ ప్రదర్శించాడు. పంజాబ్‌ నిర్దేశించిన 184 పరుగుల లక్ష్యాన్ని బ్యాట్స్‌మెన్‌ సమిష్టిగా రాణించడంతో కోల్‌కతా ఆడుతూ.. పాడుతూ ఛేదించింది. ఛేదనలో ఓపెనర్‌గా వచ్చిన శుబ్‌మన్‌ గణనీయమైన పాత్రను పోషించాడు.

అంతేకాదు ఈ మ్యాచ్‌లో అర్ధ సెంచరీ సాధించడం ద్వారా శుబ్‌మన్‌ తన పేరిట భారీ రికార్డును నెలకొల్పాడు.

20 ఏళ్ల లోపే ఐపీఎల్‌లో నాలుగు సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా రికార్డు సాధించాడు. సంజు సామ్సన్‌, రిషభ్‌ పంత్‌ వంటి యంగ్‌స్టర్స్‌ను అధిగమించి శుబ్‌మన్‌ ఈ రికార్డు సొంతం చేసుకోవడం గమనార్హం. శుబ్‌మన్‌ ఆటతీరుతో ముగ్ధులైన అభిమానులు ట్విటర్‌లో ప్రశంసల జల్లు కురిపించారు. అతను ఫ్యూచర్‌ విరాట్‌ కోహ్లి అని, భారత్‌ క్రికెట్‌లో గొప్ప ఆటగాడిగా అతను ఎదుగుతాడని కొనియాడారు.

తలా కొంత దంచేశారు…
184 పరుగుల లక్ష్యఛేదనలో కోల్‌కతా ఇన్నింగ్స్‌ ఎక్కడా వేగం తగ్గలేదు. ఓపెనర్లలో శుబ్‌మన్‌ సంయమనం చూపగా, లిన్‌ మొదటి నుంచే ధాటిగా ఆడుతూ పంజాబ్‌కు వణుకు పుట్టించాడు. అర్షదీప్‌ ఓవర్లో హ్యాట్రిక్‌ బౌండరీలు, అశ్విన్‌ బౌలింగ్‌లో రెండు ఫోర్లు బాదాడు. ఆండ్రూ టై ఓవర్లో వరుసగా 6, 4 కొట్టాడు. మరుసటి బంతికి భారీ షాట్‌ ఆడబోయి టైకే క్యాచ్‌ ఇచ్చాడు. పవర్‌ ప్లే అనంతరం నైట్‌ రైడర్స్‌ 62/1తో నిలిచింది. ఉతప్ప (14 బంతుల్లో 22; 2 ఫోర్లు, సిక్స్‌) ఔటయ్యాక గిల్‌ జూలు విదిల్చాడు. అప్పటివరకు బంతికో పరుగు చొప్పున చేస్తున్న అతడు… అశ్విన్‌ వేసిన 13వ ఓవర్లో విరుచుకుపడి రెండు సిక్స్‌లు, ఫోర్‌ కొట్టాడు. 48 బంతుల్లో 74 పరుగులుగా ఉన్న విజయ సమీకరణం దీంతో ఒక్కసారిగా 42 బంతుల్లో 54 పరుగులుగా మారిపోయింది. 36 బంతుల్లోనే గిల్‌ అర్ధ సెంచరీ పూర్తయింది. అనంతరం టై బౌలింగ్‌లో రసెల్‌ (14 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రెండు సిక్స్‌లు బాదడంతో లక్ష్యం మరింత తేలికైంది. కరన్‌ ఓవర్లో కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ (9 బంతుల్లో 21 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) తనదైన శైలిలో షాట్లు కొట్టి అనుకున్నదానికంటే ముందే మ్యాచ్‌ను ముగించాడు. కీలకమైన మ్యాచ్‌లో అదీ సొంతగడ్డపై బౌలింగ్‌ తేలిపోవడం పంజాబ్‌ను దెబ్బతీసింది.