కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన ఫెర్రర్‌

క్లే కోర్టు కింగ్‌ రాఫెల్‌ నాదల్‌ మాడ్రిడ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో ముందంజ వేశాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ మ్యాచ్‌లో ప్రపంచ నం.2 నాదల్‌ 6–3, 6–3తో ఫెలిక్స్‌ అగర్‌ (కెనడా)పై వరుస సెట్లలో గెలుపొంది ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. మరో మ్యాచ్‌లో డేవిడ్‌ ఫెర్రర్‌ 4–6, 1–6తో అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) చేతిలో ఓడిపోయాడు. అనంతరం సొంతగడ్డపై ఫెర్రర్‌ తన కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. కెరీర్‌లో అత్యత్తమంగా ప్రపంచ నం.3 ర్యాంకుకు చేరిన ఫెర్రర్‌… ఓవరాల్‌గా 27 ఏటీపీ సింగిల్స్‌ టైటిల్స్‌ను సాధించాడు.

క్వార్టర్స్‌లో ఫెడరర్‌
మరోవైపు స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ ఈ టోర్నీలో క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో ఫెడరర్‌ 6–0, 4–6, 7–6 (3)తో గేల్‌ మోన్‌ఫిల్స్‌ (ఫ్రాన్స్‌)ను ఓడించాడు. కెరీర్‌లో ఫెడరర్‌కు ఇది 1200వ విజయం కావడం విశేషం.