జర్మనీ, బ్రెజిల్‌, జపాన్‌కు కూడా శాశ్వత సభ్యత్వం కల్పించాల్సిందే

భారత్‌తో పాటు జర్మనీ, బ్రెజిల్‌, జపాన్‌కు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించాల్సిన అవసరం ఉందని ఫ్రాన్స్‌ అభిప్రాయపడింది. సమకాలీన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆయా దేశాలకు శాశ్వత హోదా ఇవ్వాలని వివరించింది. గతవారం జరిగిన ఓ విలేకరుల సమావేశంలో ఐరాసలో ఫ్రాన్స్‌ ప్రతినిధి ఈ మేరకు అభిప్రాయపడ్డారు. అలాగే ఈ అంశం ఆ దేశ వ్యూహాత్మక విధానాల్లో అత్యంత ప్రాధాన్య అంశంగా ఉందని వారు పేర్కొన్నారు.

‘‘ఐరాస భద్రతా మండలి పరిధిని విస్తృతం చేయడం, అందుకు దారితీసే చర్చల్లో విజయం సాధించడానికి జర్మనీ, ఫ్రాన్స్‌కు పటిష్ఠ విధానం ఉంది. ప్రపంచ దేశాలకు తగిన ప్రాతినిధ్యం లభించాలంటే యూఎన్‌ఎస్సీలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది’’ అని ఐరాసలో ఫ్రాన్స్‌ శాశ్వత ప్రితినిధి ఫ్రానోయిస్‌ డెలాట్రే అభిప్రాయపడ్డారు. అందులో భాగంగా భారత్‌, జర్మనీ, జపాన్‌, బ్రెజిల్‌తో పాటు ఆఫ్రికా దేశాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం కచ్చితంగా ఉందని స్పష్టం చేశారు.

భవిష్యత్తులో ప్రపంచ దేశాలను మధ్య సమన్వయం చేయడంలో ఐరాస పాత్రను మరింత పటిష్ఠం చేయడానికి జర్మనీ, ఫ్రాన్స్‌ కలిసి పనిచేస్తున్నాయని డెలాట్రే తెలిపారు. అందుకు మండలిలో తగిన మార్పులు తీసుకురావడానికి కృషి చేస్తున్నామన్నారు. మండలి సంస్కరణ ఆవశ్యకతను భారత్‌ కూడా తీవ్రంగా పరిగణిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సంవత్సర ప్రారంభంలో జరిగిన ఓ సమావేశంలో.. మండలిలో సమాన ప్రాతినిధ్యం అంశాన్ని ఐరాస భారత ప్రతినిధి అక్బరుద్దీన్‌ కూడా లేవనెత్తడం గమనార్హం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలి విస్తరణకు 113 సభ్య దేశాలు సముఖంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.