విద్యుత్‌ పంపిణీ సంస్థ డేటాను తొలగించి రూ.35 కోట్లు డబ్బు డిమాండ్‌ చేసిన హ్యాకర్స్

హ్యాకర్లు మరోసారి రెచ్చిపోయారు. తెలుగు రాష్ట్రాలపై పంజా విసిరారు. ఏపీ, తెలంగాణకు చెందిన పలు విద్యుత్‌ పంపిణీ సంస్థల వెబ్‌సైట్లను హ్యాక్‌ చేశారు. దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌), ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎన్పీడీసీఎల్‌), దక్షిణ ఆంధ్ర ప్రదేశ్‌ విద్యుత్‌ పంపిణీ సంస్థ(ఏపీఎస్పీడీసీఎల్‌), తూర్పు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్‌)లకు చెందిన అధికారిక వెబ్‌సైట్లను అంతర్జాతీయ హ్యాకర్లు హ్యాక్‌ చేశారు.

ర్యాన్‌సమ్‌వేర్‌ వైరస్‌ ద్వారా సర్వర్లలో ఉన్న డేటాను తస్కరించి.. డేటాను పూర్తిగా తొలగించారు. ఆ డేటాను వెనక్కి ఇచ్చేందుకు రూ.35 కోట్లు డబ్బు డిమాండ్‌ చేశారు. సమాచారం అంతా బ్యాకప్‌ ఉండడంతో ముప్పు తప్పింది. డిస్కంల హ్యాకింగ్‌పై సీసీఎస్‌ పోలీసులకు టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ ఫిర్యాదు చేసింది. ఐటీ యాక్టు కింద సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.