అమెరికాపై మండిపడిన హువావే

అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతున్న కారణంగా హార్డ్‌వేర్‌, ఆండ్రాయిడ్‌ సాఫ్ట్‌వేర్‌, టెక్నాలజీ సేవలను హువావేకు బదిలీ చేయడం నిలిపేస్తున్నట్లు గూగుల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా చైనా మొబైల్‌ ఫోన్ల తయారీదారైన హువావే అమెరికాపై మండిపడింది. దీనిపై హువావే వ్యవస్థాపకుడు రెన్‌ జెంగ్‌ఫీ గట్టిగానే స్పందించాడు. తమని తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరించాడు. ‘మా బలాన్ని’ తక్కువగా అంచనా వేసి అమెరికా రాజకీయ నాయకులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు అని చైనీస్‌ స్టేట్‌ మీడియా సీసీటీవీతో అన్నారు.

మరోపక్క హువావే వ్యాపారం చేయడానికి వీల్లేకుండా విధించిన నిషేధాన్ని 90రోజులు సడలిస్తున్నట్లు ట్రంప్‌ సర్కారు ప్రకటించింది. ఈ మేరకు అమెరికా వాణిజ్య విభాగం ప్రకటన వెలువరించింది. ఈ నిర్ణయంతో హువావేకు కాస్త ఊరట లభించింది. అయితే, హువావేతో జాతీయ భద్రతకు ముప్పు ఉందని, ట్రంప్‌ విధించిన నిషేధంలో ఎలాంటి మార్పు ఉండదని వాణిజ్య విభాగం తెలిసింది. అమెరికా సంస్థలతో వాణిజ్యం కొనసాగించేందుకు హువావేకు తాత్కాలిక లైసెన్స్‌ మాత్రమే ఇస్తున్నట్లు ప్రకటించింది.