చైనా లో కెమికల్ ప్లాంటులో భారీ పేలుడు

చైనా యాన్ చెంగ్ లో కెమికల్ ప్లాంటులో పేలుడు సంభవించిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఎరువులు తయారు చేసే ప్లాంటులో మంటలు చెలరేగడంతో పేలుడు సంభవించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. పేలుడుతో మంటలు పరిసర ప్రాంతాలకు వ్యాపించడంతో భవనాలు దెబ్బతిన్నాయి. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

అయితే ఈఘటనలో మృతుల సంఖ్య 44కు చేరింది. మరో 90 మంది తీవ్రంగా గయపడ్డారు. క్షతగ్రాతుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి. పేలుడు తీవ్ర స్థాయిలో ఉండడంతో భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం. ఇంకా విష వాయువులు లీకయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మరిన్ని పేలుళ్లు సంభవించవచ్చని భావిస్తున్నారు.

సమీప ప్రాంతాల్లోని దాదాపు 1000 నివాస గృహాలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ఘటనలో గాయపడిన వారికి చికిత్స అందించడానికి దాదాపు 3500 మంది ప్రత్యేక వైద్య సిబ్బందిని రంగంలోకి దింపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పేలుడు ధాటికి పరిశ్రమలోని కిటికీ అద్దాలు దాదాపు 6కి.మీ దూరంలో పడ్డట్లు అక్కడి మీడియా పేర్కొంది. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరుపుతామని అధికారులు తెలిపారు.