26 మంది నేవీ సిబ్బందికి కరోనా పాజిటివ్‌

భారత నౌకదళంలో కరోనా కలకలం రేపింది. ముంబైలోని నౌకాదళ పశ్చిమ కమాండ్‌కు చెందిన లాజిస్టిక్స్‌, అడ్మినిస్ట్రేటివ్‌ కేంద్రం ‘ఐఎన్‌ఎస్‌ అంగ్రే’లో పనిచేస్తున్న 26 మంది నేవీ సిబ్బందికి కరోనా పాజిటివ్ అని తేలింది. వీళ్లందరినీ ముంబైలోని నేవీ హోస్పిటల్ కు తరలించి ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ఐఎన్‌ఎస్‌ అంగ్రేలో పనిచేస్తున్న ఒకరికి ఈ నెల 7వ తేదీన కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. దాంతో ఇతర సిబ్బందికి, వారి కుటుంబసభ్యులకు కొవిడ్‌-19 పరీక్షలు జరుపగా, మొత్తం 26 మంది సిబ్బందికి పాజిటివ్‌ అని తేలింది. వీరు ఎవరెవరిని కలుసుకొన్నది, ఎక్కడెక్కడ తిరిగింది అధికారులు ఆరా తీస్తున్నారు.

దాంతో ఈ ప్రాంతాన్ని కంటైన్మెంట్‌ క్లస్టర్‌గా ప్రకటించి లాక్‌డౌన్‌ కఠినంగా అమలుచేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఎనిమిది మందికి కరోనా సోకినట్లు ఇండియన్‌ ఆర్మీ ప్రకటించింది. వీరిలో ఇద్దరు వైద్యులు, ఒకరు నర్స్‌ కాగా, మిగిలినవారు సైనికులు.