ప్యాకేజిని ప్రకటించిన ఆర్‌బిఐ గవర్నర్‌

కరోనా వైరస్‌ ఎక్కువగా విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యవస్థలో నగదు చలామణీ పెంచడానికి అనేక చర్యలు చేపడుతున్నట్లు ఆర్‌బిఐ ప్రకటించింది. శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఈ విషయం తెలిపారు.

ప్రస్తుతమున్న రివర్స్‌ రిపో రేటును 4 శాతం నుండి 3.75 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు. ఈ చర్య వల్ల బ్యాంకులకు అదనంగా 0.25 శాతం మేర నగదు అందుబాటులోకి వస్తుంది. రాష్ట్రాలకు వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్స్‌ను 60శాతం మేర పెంచుతున్నట్లు ఆయన చెప్పారు. దీనివల్ల ఆర్‌బిఐ నుండి వివిధ రాష్ట్రాలు తీసుకునే స్వల్పకాల రుణాల మొత్తం పెరుగుతుంది. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు కొంత మేర అదనపు నిధులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

జాతీయ హౌసింగ్‌ బోర్డుకు 10 వేల కోట్లు, నాబార్డుకు 25 వేల కోట్లు, SIDBI కు 15 వేల కోట్లుతో వివిధ సూక్ష్మ ఆర్థిక సంస్థలకు కూడా ప్యాకేజిని ప్రకటించిన ఆర్‌బిఐ గవర్నర్‌ ఆర్థిక వ్యవస్థపై వైరస్‌ ప్రభావాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. సంక్షోభాన్ని ఎదుర్కొవడానికి ఫిబ్రవరి 6 నుంచి మార్చి 27 నాటికి జిడిపిలో 3.2శాతం ద్రవ్యాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా 9 ట్రిలియన్‌ డాలర్ల మేర నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంచనా వేశారు. ప్రపంచం 1930 తర్వాత ఇంతటి సంక్షోభాన్ని ఎప్పుడూ ఎదుర్కోలేదన్నారు.