నాబార్డ్ సహాయం కోరిన సిఎం జగన్

ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.. 2022లో పోలవరం ప్రాజెక్టును ప్రారంభించాలని టార్గెట్‌గా పెట్టుకుంది… ఇక, పోలవరం ప్రాజెక్టు పూర్తికి రాష్ట్రానికి సహకారం అందించాలని నాబార్డును కోరారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి… ఇప్పటి వరకూ రూ. 5 వేల కోట్ల ఖర్చు చేస్తే.. వడ్డీ రూ. 500 కోట్లు చెల్లించాల్సి వస్తోందని నాబార్డు సమావేశంలో తెలిపారు సీఎం. నాబార్డు ఇచ్చిన రుణ మొత్తం రూ.1800 కోట్లు నేరుగా రాష్ట్రానికి కాకుండా పీపీఏకు వెళ్లిందని చెప్పారు.

ఇలాంటి సమస్యలు పరిష్కరించాలని నాబార్డును కోరారు జగన్. ఏడాదికి రూ. 10 వేల కోట్ల చొప్పున పునరావాసం, పరిహార ప్యాకేజీల కోసం కావాలన్నారు. సివిల్ పనుల కోసం రూ.6 వేల కోట్లు అవసరమవుతాయని స్పష్టం చేసిన సీఎం.. పోలవరం నిర్మాణానికి నిధుల కొరత ఉన్నందున నాబార్డు సహకారం అవసరం అన్నారు.. రాష్ట్రంలో రైతులు, వ్యవసాయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాల అమలుకూ నాబార్డు సహకారం కోరారు. కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేస్తే రైతులకు రుణాలు తీసుకోవటం సులువవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు పెద్ద ఎత్తున గోదాములు, కోల్ట్ స్టోరేజీల అవసరమూ ఉందన్నారు. వీటి నిర్మాణం కోసమూ నాబార్డు ఆర్ధిక సహకారం అందించాలని కోరారు సీఎం జగన్.