భారత్ కు ఏడీఆర్‌సీ టవర్ ను అందచేస్తున్న జపాన్

తుపానులు, భారీ గాలుల సమయంలో సెల్‌ టవర్లు దెబ్బతిని మొబైల్‌ సేవలు నిలిచిపోయినా ఆ ప్రాంతంలోని అన్ని ఫోన్లకు ముందస్తు హెచ్చరిక సందేశాలు పంపించే క్యూజెడ్‌ఎస్‌ఎస్‌ అనే సాంకేతిక పరిజ్ఞానం త్వరలో రాష్ట్రానికి అందుబాటులోకి రానుంది. జపాన్‌కు చెందిన ఏషియన్‌ డిజాస్టర్‌ రిడక్షన్‌ సెంటర్‌ (ఏడీఆర్‌సీ) దీనిని అందించేందుకు ముందుకొచ్చింది.

సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరు కోజి కోహ్లి ఆధ్వర్యంలోని బృందం శుక్రవారం కుంచనపల్లిలోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో ఎండీ ప్రసన్న వెంకటేశ్‌తో సమావేశమై చర్చించింది. తాము అభివృద్ధి చేసిన ఉపగ్రహ ఆధారిత పరిజ్ఞానాన్ని ఉచితంగా ఇచ్చేందుకు కోజి కోహ్లి అంగీకరించారు. పరికరాల ఏర్పాటుకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. టెక్నాలజీ బదలాయింపునకు కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. తరచూ తుపానుల ప్రభావం ఉండే రాష్ట్రానికి దీనివల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులకూ దీనివల్ల అత్యవసర సందేశాలు అందే వీలుంటుంది