నంద్యాల పార్లమెంటు సభ్యుడు ఎస్పీవై రెడ్డి మృతి

గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నంద్యాల పార్లమెంటు సభ్యుడు ఎస్‌.పి.వై.రెడ్డి (69) మంగళవారం రాత్రి మృతి చెందారు. గుండె, ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన చికిత్స నిమిత్తం ఏప్రిల్‌ 3న హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి ఆయన మృతిచెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎస్పీవైరెడ్డి మూడు దఫాలుగా లోక్‌సభ సభ్యునిగా విశేష సేవలందించారు. నందిపైపుల అధినేతగా ఆయన ముద్ర వేసుకున్నారు. ఈ దఫా జనసేన తరపున నంద్యాల పార్లమెంటు స్థానానికి పోటీ పడ్డారు. పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ వెంట కర్నూలు జిల్లా నందికొట్కూరు, నంద్యాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎండల తీవ్రతవల్ల వడదెబ్బకు గురైన ఆయనను పెద్ద కుమార్తె సుజల ఏప్రిల్‌ 4వ తేదీ ఉదయం హైదరాబాద్‌లోని కేర్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి కేర్‌ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. సుమారు 26 రోజులుగా అక్కడే చికిత్స అందిస్తున్నా ఫలితం లేకపోయింది. ఆయన మరణవార్తతో అంతటా విషాదఛాయలు అలుముకున్నాయి.

సేవాతత్పరుడు, రైతుల ఆత్మబంధువు
ఎంపీ కాక ముందునుంచీ ఎస్పీవై రెడ్డి అందరికీ సుపరిచితుడు. ఉచితంగా రైతులకు బోర్లు వేయించడం, బావులు తవ్వించడం, పాఠశాలల్లో జరిగే క్రీడలకు అన్నదానం చేయించడం సేవా కార్యక్రమాలతో ఆయన ప్రతి ఒక్కరికీ ఆత్మబంధువులా మారారు. కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలోని ప్రతి పొలంలో బోరు బావులు దర్శనమిస్తాయి. వీటిని ఏర్పాటు చేసుకునేందుకు పైపులు, మోటార్లు ఉచితంగా అందించారు. కాల్వలు, ఎత్తిపోతల్లో నీరు లేక పంటలు ఎండి పోతున్నాయని అన్నదాతలు మొర పెట్టుకుంటే ప్రభుత్వం, అధికారులతో పోరాడి నీటిని విడుదల చేయించి రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన రూపాయికే జొన్నరొట్టె, పప్పు, మజ్జిగ, రూ.3లకు కొబ్బరిబొండం పంపిణీ చేసి నిరుపేదల మన్ననలందుకున్నారు. రాయలసీమలో ఎస్పీవై రెడ్డి చేపట్టిన అనేక సేవలు ప్రజల మనసుల్లో నిలిచిపోయాయి.

ఎస్పీవైరెడ్డి ప్రస్థానం
కడప జిల్లా అంకాలమ్మ గూడూరు గ్రామంలో 1950, జూన్‌ 4న ఎస్‌.పెద్ద యెరికల్‌ రెడ్డి(ఎస్పీవై రెడ్డి) జన్మించారు. వరంగల్‌ నిట్‌ నుంచి ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్‌ పట్టా పొందారు. ఆ తర్వాత బాబా అటమిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో చేరారు. 1977లో సైంటిఫిక్‌ అధికారి స్థానం నుంచి రాజీనామా చేసి ఒక ప్లాస్టిక్‌ కంటైనర్ల ఉత్పాదక ప్లాంటును నెలకొల్పారు. 1984లో నంది పైపులు(పీవీసీ) కంపెనీ ఏర్పాటు చేసి నంద్యాల రైతాంగంలో గుర్తింపు పొందారు. 1991 ఎన్నికల్లో భాజపా తరఫున ఎస్పీవై రెడ్డి పోటీ చేయగా కేవలం 47,412 ఓట్లు లభించాయి. ఆ తర్వాత 1999లో నంద్యాల, గిద్దలూరు నియోజకవర్గాలు రెండింటిలోనూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో నంద్యాలలో 3,825 స్వల్ప తేడాతో ఫరూక్‌పై ఓటమిపాలయ్యారు. 2000లో నంద్యాల మున్సిపల్‌ ఛైర్మన్‌ అభ్యర్థిగా కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి భారీ మెజార్టీ సాధించారు. 2004, 2009లో కాంగ్రెస్‌ తరఫున, 2014లో వైకాపా తరఫున బరిలోకి దిగి విజయం సాధించారు. దీంతో వరసగా మూడుసార్లు గెలిచి ‘హ్యాట్రిక్‌ ఎంపీ’గా ముద్ర వేసుకున్నారు. 2014లో వైకాపా తరఫున గెలిచి అనంతర కాలంలో తెదేపాలో చేరారు. 2019 ఎన్నికల్లో నంద్యాల టిక్కెట్‌ మాండ్ర శివానందరెడ్డి ఖరారు కావడంతో జనసేనలో చేరారు. పెద్ద కుమార్తె సుజల శ్రీశైలం ఎమ్మెల్యే అభ్యర్థిగా, అల్లుడు శ్రీధర్‌రెడ్డి నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా, చిన్నకుమార్తె అరవిందరాణి బనగానపల్లె అభ్యర్థిగా జనసేన తరపున రంగంలోకి దిగారు.