జేఈఈ మెయిన్స్‌లో అయిదో ర్యాంకు సాధించిన నెల్లూరు జిల్లా విద్యార్థి

చిన్నతనం నుంచే చదువులో ప్రతిభ చూపిన ఆ విద్యార్థి సోమవారం రాత్రి విడుదలైన జేఈఈ మెయిన్స్‌లో సత్తా చాటి సింహపురి ఖ్యాతిని రెపరెపలాడించాడు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం నరసాపురం గ్రామానికి చెందిన బట్టేపాటి సురేష్‌ నాయుడు, అమరావతి కుమారుడు కార్తికేయ జాతీయ స్థాయిలో 11.47 లక్షల మంది పోటీ పడిన జేఈఈ పరీక్షలో అయిదో ర్యాంకు సాధించాడు. తండ్రి సురేష్‌ నాయుడు ఆక్వా రైతు. బాల్యం నుంచి కుమారుడు చదువులో చురుకుగా ఉండటంతో అతనికి నచ్చిన పాఠశాల, కళాశాలల్లో చదివించారు. కార్తికేయ అక్క షణ్ముఖ ప్రియ సైతం గతంలో జేఈఈలో మంచి ర్యాంకు సాధించి ప్రస్తుతం తిరుచ్చి ఎన్‌ఐటీలో ఇంజినీరింగ్‌ విద్య అభ్యసిస్తున్నారు.

ప్రాథమిక విద్య నుంచే సత్తా

కార్తికేయ ప్రాథమిక విద్యాభ్యాసం నెల్లూరులో జరిగింది. నగరంలోని గోమతి పాఠశాలలో నాలుగో తరగతి వరకు, వెంకటాచలంలోని అక్షర విద్యాలయంలో ఐదు చదివాడు. ఆరు, ఏడు తరగతులు మినీబైపాస్‌లోని నారాయణ ఈ-టెక్నో పాఠశాల, ఎనిమిది నుంచి పదో తరగతి వరకు విజయవాడలోని నారాయణ విద్యాసంస్థలో చదివాడు. పదో తరగతిలో 10కి 10 జీపీఏ సాధించి మొదటిసారి ప్రతిభ చాటాడు. శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థలు నిర్వహిస్తున్న చైనా బ్యాచ్‌లో ఇంటర్మీడియట్‌ చదివి 981 మార్కులు సాధించాడు. జనవరిలో జరిగిన జేఈఈ మెయిన్స్‌ మెదటి ఫలితాల్లో అఖిలభారత స్థాయిలో 100 పర్సంటైల్‌తో ఉత్తీర్ణత, రెండో విడత జరిగిన జేఈఈ మెయిన్స్‌లో 5వ ర్యాంకు కైవశం చేసుకున్నాడు. మేనెలలో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష జరగనుంది.

సివిల్స్‌ సాధించడమే లక్ష్యం – కార్తికేయ

చిన్నప్పటి నుంచి పోటీ పరీక్షలు అంటే ఇష్టం. కళాశాలలో ఇచ్చిన శిక్షణ జేఈఈ మెయిన్స్‌లో రాణించడానికి ఉపయోగపడింది. వివిధ సబ్జెక్టులకు సంబంధించిన అంశాలను క్షుణ్నంగా చదవడం అలవాటు. గతంలో ముంబయిలో జరిగిన జూనియర్‌ ఒలంపియాడ్‌, ఇంటర్నేషనల్‌ ఒలంపియాడ్‌లలో మంచి ర్యాంకులు వచ్చాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో కూడా మంచి ర్యాంకు సాధించి ముంబయి ఐఐటీలో సీటు సాధించి కంప్యూటర్‌ ఇంజినీర్‌గా రాణిస్తా. అనంతరం సివిల్స్‌ పరీక్షలకు సన్నద్ధమవుతా. సివిల్స్‌ సాధించి ప్రజలకు సేవ చేస్తా. అక్క షణ్ముఖ ప్రియ స్ఫూర్తితో ముందుకు సాగుతున్నా.