13వ తేదీన సీఎం తో సమావేశం కానున్న జిల్లా కార్యకర్తలు

జిల్లా రాజకీయాలు అనూహ్యంగా మారాయి. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం టిక్కెట్టు ప్రకటించిన తర్వాత అధికార తెదేపాలో నిరాశకు గురైన నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీన్ని సర్దుబాటు చేయటానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర రంగంలోకి దిగారు. టిక్కెట్టు ఆశించిన నగర మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌తో సీఎం సమావేశానికి ముందు సమావేశమైన విషయం తెలిసిందే. తాజాగా గ్రామీణ నియోజకవర్గం నుంచి టిక్కెట్టు ఆశించిన పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి, ఆనం జయకుమార్‌రెడ్డి ఇళ్లకు ఆయన నేరుగా వెళ్లి మంతనాలు జరపటం రాజకీయంగా ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఎన్నికలకు ముందుగా ముఖ్య నేతలు పార్టీని వీడితే ఇబ్బందులు ఉంటాయని ఇదే సమయంలో పార్టీ కార్యకర్తల్లో కూడా ఒకింత నిరాశ కలిగే ప్రమాదం ఉందని పార్టీ భావించింది. ఈ మేరకు అసంతృప్త నేతలను బుజ్జగించే పక్రియను పార్టీ జిల్లా అధ్యక్షుడు మొదలుపెట్టారు. జిల్లాకు సంబంధించి త్వరలో సీఎం దగ్గర సమావేశం ఏర్పాటు చేసి.. అక్కడ సమస్యకు పరిష్కారం చూపనున్నట్లు హామీ ఇచ్చారు. అసంతృప్త నేతలు ఒకింత శాంతించారు. సీఎం దగ్గర సమావేశం తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపై ఆలోచనలో ఉన్నారు.

ఉదయమే వెళ్లి మంతనాలు

పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర మొదట కోవూరు నియోజకవర్గ పార్టీ నాయకుడు పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయనతో సుదీర్ఘంగా మంతనాలు చేశారు. రానున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బ్యాలెట్‌లో పేరు ఉండాల్సిందేనన్న భావన ఆయన వ్యక్తం చేసినట్లు తెలిసింది. జిల్లాకు సంబంధించి 13వ తేదీ బుధవారం రాజధానిలో సీఎం దగ్గర సమావేశం ఏర్పాటు చేస్తామని.. అక్కడ అన్ని విషయాలు చర్చించాలని సూచించారు. ఎన్నికలు సమీపంలో ఉన్న దృష్ట్యా ఎలాంటి ప్రకటన చేయవద్దని సూచించి వెళ్లారు.  గ్రామీణ నియోజకవర్గానికి పరిశీలిస్తే ఆదాల మద్దతులో పోటీ చేయాలని భావించానే తప్పించి కోవూరు నుంచే టిక్కెట్టు ఆశిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షునికి వివరించినట్లు సమాచారం. దీంతో మొత్తం వ్యవహారం సీఎం సర్దుబాటు చేస్తారని.. అప్పటి వరకు తొందరపడి ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించొద్దని చెప్పినట్లు తెలుస్తోంది.

అక్కడి నుంచి పార్టీ మరో నాయకుడు ఆనం జయకుమార్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడ సుదీర్ఘంగా మంతనాలు చేశారు. బీదతో జరిగిన చర్చలో జయకుమార్‌ పార్టీ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. తన సోదరుడు పార్టీని వీడి వెళ్లినా ,తాను పార్టీని నమ్ముకుని ఉన్నానని జిల్లా అధ్యక్షుని దగ్గర ప్రస్తావించారు. నెల రోజుల ముందు ఆదాల ప్రభాకరరెడ్డి పిలిపించి తాను కావలి, కోవూరు నియోజకవర్గాల్లో ఎక్కడో ఒక చోట నుంచి పోటీ చేస్తానని.. లేకుంటే పార్లమెంటు అభ్యర్థిగా బరిలో ఉంటానని చెప్పారన్నారు. గ్రామీణ టిక్కెట్టు తనకు కేటాయించే విధంగా సీఎం దగ్గర మాట్లాడతామని చెప్పారు.

టిక్కెట్టు కేటాయించే సమయంలో తనతో ఎలాంటి సంప్రదింపులు చేయలేదని.. అక్కడే ఉన్నా తనకు చెప్పలేదన్నారు. గ్రామీణ నియోజకవర్గ టిక్కెట్టు ప్రకటించిన తర్వాత ఆయన ఆదాల ఇంటికి కాకతాళీయంగా వెళ్తే అప్పటికే సంబరాల్లో ఉన్నారన్నారు. అప్పుడే అసంతృప్తి వ్యక్తి చేసి వచ్చానని జయకుమార్‌రెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షుని దగ్గర ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తన సోదరుడు ఆనం వివేకానందరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తామని ఒకసారి ఇబ్బంది పెట్టారని.. అయినా పార్టీని నమ్ముకుని ఉన్నానని చెప్పారు. ఆదాలను నమ్ముకుని పార్టీలో ఉంటే తనతో సంప్రదించకుండానే ఆయనకు టిక్కెట్టు కేటాయించారన్నారు. ఇది తనకు బాధ కలిగించిందని అన్నట్లు తెలుస్తోంది. రామనారాయణరెడ్డి పార్టీ మారే సమయంతో తనను సీఎం దగ్గరకు తీసుకెళ్లి.. జయకుమార్‌రెడ్డి మనతోనే ఉన్నట్లు చూపించింది వాస్తవం కాదా? అంటూ బీద దగ్గర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. అందుకే సీఎం పర్యటనకు దూరంగా ఉన్నట్లు చెప్పారు.

13న కీలక నిర్ణయం
సీఎం పర్యటన సమయంలో అసంతృప్త నేతల వ్యవహారంపై కొద్ది సేపు ప్రస్తావన వచ్చినట్లు సమాచారం. జిల్లాకు చెందిన నేతలతో బుధవారం ప్రత్యేకంగా సమావేశం కావాలని సీఎం చంద్రబాబు సూచించారు. అదే రోజు నగర మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌, పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి, ఆనం జయకుమార్‌రెడ్డిను అమరావతి తీసుకెళ్లి అక్కడ పార్టీ తరఫున ఎలాంటి హామీ ఇవ్వాలనే విషయాన్ని సీఎం సూచిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే విషయాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర నేతలకు సూచించారు. బుధవారం సీఎం దగ్గర సమావేశం తర్వాత నిర్ణయాన్ని ప్రకటిస్తామని నేతలు చెప్పారు. పార్టీ అసంతృప్త నేతలు ‘ఈనాడు’తో మాట్లాడుతూ అందరూ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. దీంతో బుధవారం జిల్లా నేతల సమావేశం తర్వాత అసంతృప్తి చల్లారుతుందా? దానికి ఎలాంటి సమీకరణాలను పార్టీ అధినేత సిద్ధం చేశారనేది పార్టీ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.