త్వరలోనే వివాహం చేసుకోబోతున్న న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండా ఆర్డర్న్‌

న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండా ఆర్డర్న్‌ త్వరలోనే వైవాహిక బంధంలో అడుగుపెట్టనున్నారు. తన సహచరుడు క్లార్క్‌ గేఫోర్డ్‌తో త్వరలోనే ఆమె వివాహం జరుగనుందని ప్రధాని కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ విషయం గురించి జెసిండా అధికార ప్రతినిధి మాట్లాడుతూ..ఈస్టర్‌ ఆదివారం రోజున ప్రధాని, క్లార్క్‌ల ఎంగేజ్‌మెంట్‌ జరిగినట్లు పేర్కొన్నారు. అయితే పెళ్లి తేదీ గురించి మాత్రం ప్రస్తుతానికి నిర్ణయం జరుగలేదని, ఇంతకుమించిన వివరాలు తాను వెల్లడించలేనన్నారు.

కాగా టీవీ ఫిషింగ్‌ షో హోస్ట్‌ క్లార్క్‌ గేఫోర్డ్‌, జెసిండాలకు ఆరేళ్ల క్రితం పరిచయమైంది. న్యూజిలాండ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జాతీయ భద్రతా చట్టంలో మార్పులు తీసుకువస్తుందన్న వార్తల నేపథ్యంలో.. ఆ విషయం గురించి ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా అక్కడ జెసిండాను కలుసుకున్నారు. ఇక కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్న ఈ జంట గతేడాది జూలైలో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ క్రమంలో దేశాధినేత హోదాలో ఉండి బిడ్డకు జన్మనిచ్చిన రెండో మహిళగా జెసిండా రికార్డుకెక్కారు. క్లార్క్‌ కొన్నాళ్లుగా తన జాబ్‌కు దూరంగా ఉంటూ కూతురును చూసుకుంటుండగా.. జెసిండా ప్రధానిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.  మార్చి 15న న్యూజిలాండ్‌లోని రెండు మసీదులపై శ్వేత జాతీయుడు కాల్పులు జరిపినప్పుడు తక్షణమే స్పందించి, అక్కడి ముస్లింలకు అండగా  నిలబడినందుకు కృతజ్ఞతగా యూఏఈ ప్రభుత్వం ఆమె చిత్రాన్ని బుర్జ్‌ ఖలీఫాపై ప్రదర్శించి గౌరవించిన సంగతి తెలిసిందే.