కోర్టుకు హాజరైన న్యూజిలాండ్‌ కాల్పుల దుండగుడు ఏప్రిల్‌ 5వరకు విధించిన రిమండ్

న్యూజిలాండ్‌లో నరమేధం సృష్టించిన దుండగుడు బ్రెంటన్‌ టారంట్‌ను శనివారం కోర్టులో హాజరుపరచారు. శుక్రవారం అల్‌ నూర్‌, లిన్‌ వుడ్‌ మసీదుల్లో సృష్టించిన మారణహోమానికిగాను అతడిపై పోలీసులు హత్యారోపణల కింద కేసు నమోదు చేశారు. నిందితుడు బెయిల్‌కు అభ్యర్థించకపోవడంతో విచారణ నిమిత్తం ఏప్రిల్‌ 5వరకు రిమాండ్‌ విధించారు. ఖైదీ దుస్తులు, చేతులకు బేడీలు వేసి పటిష్ఠ భద్రత మధ్య నిందితుడిని పోలీసులు కోర్టుకు తీసుకువచ్చారు. అతడిని దారుణంగా శిక్షించాలంటూ బాధిత కుటుంబ సభ్యులు కోర్టు ముందు నినాదాలు చేశారు.

జాతి విద్వేషం తలకెక్కిన దుండగుడు న్యూజిలాండ్‌లోని మసీదుల్లో శుక్రవారం విచక్షణారహితంగా కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 49 మంది చనిపోగా.. దాదాపు 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో వివిధ దేశాలకు చెందిన వారు ఉన్నారు. భారత్‌కు చెందిన 9 మంది గల్లంతయినట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. ఈ దాడుల్లో హైదరాబాద్‌కు చెందిన ఆరుగురికి గాయాలయ్యాయి. అయితే దుండగుడు బ్రెంటన్‌ వద్ద లైసెన్స్‌ పొందిన తుపాకీ ఉన్నట్లు ఆ దేశ ప్రధాని జసిండా అర్డెర్న్‌ తెలిపారు. ఈ దాడిలో పలు రకాల తుపాకులను వాడినట్లు జసిండా వెల్లడించారు. దీంతో తుపాకుల వినియోగాన్ని కఠినతరం చేస్తూ చట్టాల్లో మార్పులు తీసుకొస్తామని ఆమె హామీ ఇచ్చారు. దేశ భద్రత దృష్ట్యా తుపాకుల వినియోగాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.