అమెరికాపై ఒత్తిడి తీసుకురావడానికి ఉత్తరకొరియా వ్యూహం

దీర్ఘశ్రేణి బహుళ రాకెట్‌ లాంచర్లు, వ్యూహాత్మక గైడెడ్‌ ఆయుధాలను పరీక్షించి వారం రోజులు కాక ముందే ఉత్తర కొరియా మరోసారి రెండు స్వల్ప శ్రేణి క్షిపణులను పరీక్షించింది. గురువారం ప్యాంగ్యాంగ్‌లోని వాయవ్య భాగంలోని సినో రీ నుంచి వీటిని తూర్పు వైపుగా పరీక్షించినట్లు దక్షిణ కొరియా ఆర్మీ ప్రకటించింది. ‌అణ్వస్త్ర సమస్యపై చర్చించేందుకు అమెరికాకు చెందిన దౌత్యవేత్త దక్షిణ కొరియా చేరుకున్న నేపథ్యంలో ఉత్తరకొరియా ఈ పరీక్ష నిర్వహించడం గమనార్హం. ఉత్తరకొరియా భూభాగం మీదుగా ఒక క్షిపణి దాదాపు 420 కిలోమీటర్లు (260 మైళ్లు), మరో క్షిపణి 270 కిలోమీటర్లు దూసుకెళ్లాయని తెలిసింది.

అమెరికాపై ఒత్తిడి తీసుకురావడానికే ఉత్తరకొరియా మళ్లీ ఇటువంటి పరీక్షలు చేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వియత్నాంలో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోన్‌ ఉంగ్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జరిపిన సమావేశం విఫలమైన విషయం తెలిసిందే. ఉత్తరకొరియా చేసిన ఈ కొత్త పరీక్షలపై పూర్తి వివరాలు తెలియరాలేదు. ఆ దేశ కాలమానం ప్రకారం ఈ రోజు సాయంత్రం 4.30కి ఈ పరీక్ష జరిగిందని దక్షిణ కొరియా అధికారులు తెలిపారు. ఇది ఒక పరీక్షేనా? లేదా బహుళ క్షిపణుల పరీక్షా? అన్న విషయంపై దక్షిణ కొరియా అధికారులు పరిశీలన జరిపారు. అంతకు ముందు కొరియాకు చెందిన ఓ నిపుణుడు మీడియాతో మాట్లాడుతూ… ‘ఇది కచ్చితంగా క్షిపణి పరీక్షే.. ఇందులో అనుమానం లేదు’ అని తెలిపారు.