15 రోజుల లోపల రెడ్‌క్రాస్‌ జనరిక్‌ మెడిసిన్‌ భవనాన్ని ఖాళీ చేయాలనీ నోటీసులు

నెల్లూరు మద్రాసు బస్టాండ్‌ వద్ద డి.ఆర్‌.డి.ఎ. భవనంలో రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో నడిచే సింహపురి జనరిక్‌ మెడిసిన్‌కు అప్పగించిన భవనాన్ని 15 రోజుల్లో ఖాళీ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని డి.ఆర్‌.డి.ఎ. ప్రాజెక్టు డైరెక్టర్‌ మురళి పేర్కొన్నారు. నెల్లూరు డి.ఆర్‌.డి.ఎ. సమావేశ మందిరంలో శుక్రవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2010లో మద్రాసు బస్టాండ్‌ వద్ద ఉన్న డి.ఆర్‌.డి.ఎ.కు చెందిన భవనాన్ని జనరిక్‌ దుకాణం ఏర్పాటుకు రూ.5 వేల అద్దెతో రెడ్‌క్రాస్‌కు ఇవ్వడం జరిగిందన్నారు. అప్పటి నుంచి ఎలాంటి అద్దె చెల్లించకుండా నిబంధనలకు విరుద్ధంగా ఆ భవనంలోనే హోర్డింగ్‌ ఏర్పాటుకు, అలాగే ఓ బ్యాంకు ఏటీఏంకు అద్దెకు రెడ్‌క్రాస్‌ నిర్వాహకులు అప్పగించారన్నారు. దీనికి సంబంధించి నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు. అయినా రక్తనిధి కేంద్రం ఛైర్మన్‌ ఎ.వి.సుబ్రహ్మణ్యం పట్టించుకోలేదని తెలిపారు.

దీనిపై కలెక్టర్‌ ముత్యాలరాజు విచారించి, 15 రోజుల లోపల భవనాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. దీంతో తాము గతంలో నోటీసు ఇచ్చిన తేదీ నుంచి 30 రోజులు, లేదా కలెక్టర్‌ ఇచ్చిన 15 రోజుల గడువులో ఏది ముందు వస్తే అది లెక్కలోకి తీసుకుని భవనాన్ని స్వాధీనం చేసుకుంటామన్నారు. రెడ్‌క్రాస్‌కు ఇచ్చిన లీజును రద్దు చేశామన్నారు. అలాగే చెల్లించాల్సిన అద్దె 2010 నుంచి వసూలు చేయడం జరుగుతుందన్నారు. వీటితోపాటు హోర్డింగ్‌కు, ఏటీఏం కేంద్రాల ఏర్పాటుకు తీసుకున్న అద్దె కూడా వసూలు చేస్తామన్నారు. ప్రజలు ఇబ్బంది పడకుండా డి.ఆర్‌.డి.ఎ. ఆధ్వర్యంలో జనరిక్‌ దుకాణాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు.