సామాన్యుల అవసరాలను తీర్చడమే జనసేన మేనిఫెస్టో అని చెప్పిన పవన్‌కల్యాణ్‌

సామాన్యులు మనల్ని కోట్లు అడగడం లేదు. బంగారం.. మేడలు అడగడం లేదు. తాగేందుకు గుక్కెడు మంచినీళ్లను అభ్యర్థిస్తున్నారు. గ్రామీణులు మెరుగైన వైద్యం అడుగుతున్నారు. అభివృద్ధి కోసం భూమి ఇచ్చిన రైతులు పరిహారం..యువత ఉద్యోగాలు.. అడుగుతున్నారు. మహిళలు రక్షణ కల్పించాలని, ఉద్యోగాలు చేసే మహిళలు వాళ్ల పిల్లలకు శిశుసంరక్షణ కేంద్రాలు అడుగుతున్నారు. వారి అవసరాలు తీర్చడమే లక్ష్యంగా జనసేన మేనిఫెస్టో రూపొందించాము’అని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవంలో పవన్‌కల్యాణ్‌ తమ పార్టీ అధికారంలోకి వస్తే చేసే సంక్షేమ పథకాల మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. 2014లో టీడీపీకి మద్దతు ఇచ్చింది చంద్రబాబు అనుభవం ఉన్న వ్యక్తి అని నమ్మానని, కానీ ఆయన పాలనంతా ఇసుక మాఫియా, జన్మభూమి కమిటీల దోపిడీల పరంపరగా సాగిందన్నారు.

‘నన్ను తిడితే పట్టించుకోను. కానీ సామాన్యుల జోలికొస్తే మాత్రం తాట తీస్తానని’తన సహజ ధోరణిలో మండిపడ్డారు. తనకు లోకేశ్, జగన్‌పై వ్యక్తిగత కోపం లేదని, వారి విధానాలపైనే నా పోరాటమని అన్నారు. ప్రధాని మోదీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా మోసం చేశారన్నారు. ‘సీఎం చంద్రబాబు మీద కోపం ఉంటే.. ఆయన మీద చూ పించండి. మా రాష్ట్రం మీద ఎందుకు చూపిస్తారని’ప్రశ్నించారు. చంద్రబాబు ఆరు నెలలకు ఒకమాట మాట్లాడతారని ఎద్దేవా చేశారు. పవన్‌ సోదరుడు సినీనటుడు నాగేంద్రబాబు, ఎంపీ అభ్యర్థులు ఆకుల సత్యనారాయణ, డీఎమ్మార్‌ శేఖర్, సినీనటుడు జి.ఎన్‌.నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్‌ తన పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారు.