డ్రగ్స్ ను పట్టుకున్న పోలీసులు

అఫ్ఘనిస్తాన్ నుంచి ఢిల్లీకి డ్రగ్స్(హెరాయిన్)ను అక్రమంగా తరలిస్తున్న గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు డ్రగ్స్ కలిగిన క్యాప్స్యూల్స్ కడుపులో దాచుకుని ఇక్కడికి వచ్చారు. వీటి ద్వారా లక్షల రూపాయిలు సంపాదించాలనుకున్నారు. అయితే నిఘా వర్గాల సూచనల మేరకు అప్రమత్తమైన పోలీసులు ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరందరి కడుపులలో 20 నుంచి 40 వరకూ క్యాప్స్యూల్స్ ఉన్నాయి. వీరి కడుపులలో నుంచి మొత్తం 177 క్యాప్స్యూల్స్ వెలికితీసి, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 10 కోట్లకు పైగానే ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. వీరికి సహకరించిన మరో ఇద్దరిని కూడా పోలీసులు కిస్టడీలోకి తీసుకున్నారు. వీరు ఢిల్లీలో ఉంటూ ఈ గ్యాంగ్‌కు సహకరిస్తారని తెలుస్తోంది. వీరిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పట్టుకుంది. వీరి కడుపులలో నుంచి ఆ క్యాప్స్యూల్స్‌ను బయటకు తీసేందుకు 10 డజన్ల అరటిపళ్లను వారిచేత తినిపించారు. కాగా వీరు ఒక ప్రత్యేకమైన ఆయిల్ వినియోగించి ఆ క్యాప్స్యూల్స్‌ను కడుపులోకి పంపించారని తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.